కరోనా ఎఫెక్ట్: కళావిహీనంగా కళాకారుల జీవితాలు కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. కేవలం కళలపై మాత్రమే ఆధారపడి జీవించే కళాకారులు ఇప్పుడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. పరిమిత సంఖ్యలోనే వేడుకలు, శుభకార్యాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశంతో... అసలు వీరికి పిలుపే రావడం లేదు.
ఫలితంగా పూట గడవని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో సుమారు 5వేల పైగా కళాకారులు ఉంటారని... ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనాలంటే కనీసం పాతిక మందికిపైగా ఉండాల్సిందే అంటున్నారు.
తక్కువ మంది అతిథులతో వేడుకలంటే... నిర్వాహకులు ఇష్టపడడం లేదని, అందువల్ల తమకు ఉపాధి లభించడం లేదని కళాకారులు వాపోతున్నారు.
తమకు తెలిసిన ఒకే ఒక విద్య పాటలు పాడటం, నృత్యం చేయడం, దానికి తగ్గ సంగీతం వాయించడమని అది తప్ప వేరే పనిచేసిన అనుభవం కూడా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇంటి అద్దెలు కట్టలేక, కరెంట్ బిల్లులు చెల్లించలేక, నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేక... ఆకలితో అలమటిస్తున్నామని కళాకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
పని చేస్తేనే తమ చేతుల్లో కాసుల గలగల ఉంటుందని... అలాంటి పనే లేకపోవడంతో తమ బతుకులు కళావిహీనంగా మారిపోయాయని బాధపడుతున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి