ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి... ఏడున్నరేళ్లుగా నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్లీనరీ సమావేశాల(TRS Plenary 2021)కు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లోనే ప్లీనరీ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు సరైన సమయంగా భావిస్తున్న గులాబీ పార్టీ నాలుగేళ్లకోసారి జరిగే ప్లీనరీ(TRS Plenary 2021)కి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది తెరాస ప్రతినిధులు ప్లీనరీకి హాజరుకానున్నారు. ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. మహిళలకు గులాబీ చీర, పురుషులు గులాబీ చొక్కా ధరించి హాజరు కావాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది. సుమారు 300 అడుగుల వేదికను ముస్తాబు చేస్తున్నారు. ప్లీనరీ వేదికపై తీగల వంతెన ఆకర్షణగా నిలవనుంది. ప్లీనరీలో తెరాస రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు... పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
ఎనిమిదోసారి అధ్యక్షుడిగా..
తెరాస రాష్ట్ర అధ్యక్ష స్థానానికి కేసీఆర్‌ను మాత్రమే ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఎనిమిదోసారి లాంఛనంగా ఎన్నిక కానున్నారు. ఉదయం పదిగంటలకు ప్రతినిధుల వివరాల నమోదు చేసుకున్నాక 11 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. తర్వాత కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. ఇరవై ఏళ్ల ప్రస్థానంతో పాటు ఏడున్నరేళ్ల అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. ప్రతినిధులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులందరితో కలిపి దాదాపు 15వేల మందికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక వంటకాలతో భోజనాలు చేయనున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత.. రాష్ట్ర, జాతీయ రాజకీయ, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
గులాబీమయంగా నగరం..
తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. హైటెక్స్ పరిసరాలతో పాటు పలు కూడళ్లలో గులాబీ తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.