Bharat Jodo Yatra Monitoring Committees in Telangana: తెలంగాణలో భారత్ జోడో యాత్ర పర్యవేక్షణ నిమిత్తం తెలంగాణ పీసీసీ 13 రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో పార్టీ సీనియర్ నాయకులందరికీ భాగస్వామ్యం కల్పించింది. కమిటీల వివరాలను పీసీసీ ఆర్గనైజింగ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్రంలోని ప్రజా సంఘాలను, మేధావులను, ఎన్జీవోలను రాహుల్ గాంధీతో సమన్వయం కోసం ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు.
జోడో యాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించారు. జోడో యాత్రను సమన్వయం చేయడం కోసం సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే దుద్దిర్ల శ్రీధర్ బాబును నియమించారు. యాత్ర పొడవునా అన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమావేశాల నిర్వహణ, కార్నర్ మీటింగ్‌ల కమిటీకి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఛైర్మన్‌గా ఉన్నారు.