తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రేటర్‌ పోరుకు ఏర్పాట్లు పూర్తి.. బరిలో 1,122 మంది అభ్యర్థులు - జీహెచ్ఎంసీ-2020

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 150 డివిజన్లలో... 1,122 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా... 74 లక్షల మందికిపైగా ఓటర్లు... ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కరోనా వ్యాప్తి వేళ... బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

arrangements completed for ghmc elections
గ్రేటర్‌ పోరుకు ఏర్పాట్లు పూర్తి.. బరిలో 1,122 మంది అభ్యర్థులు

By

Published : Nov 30, 2020, 6:39 PM IST

Updated : Dec 1, 2020, 5:13 AM IST

గ్రేటర్‌ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బల్దియాలోని 150 డివిజన్లలో... 1,122 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... 74 లక్షలకు పైగా ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 9వేల 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

48 వేల మంది సిబ్బంది

కొండాపూర్ డివిజన్‌లో అత్యధికంగా... 99 పోలింగ్ కేంద్రాలు ఉండగా... అత్యల్పంగా రామచంద్రాపురం డివిజన్‌లో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 48వేల మంది సిబ్బంది విధులు పాల్గొననున్నారు. డివిజన్ల వారీగా పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి... 30 డీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో ఇప్పటికే సామగ్రిని అందజేశారు. ఎల్బీ నగర్ జోన్‌లో 5, చార్మినార్‌ జోన్‌లో 6, ఖైరతాబాద్‌ జోన్‌లో 5, సికింద్రాబాద్‌ జోన్‌లో 5, శేరిలింగంపల్లి జోన్ లో 4, కూకట్‌పల్లి జోన్‌లో 5 డీఆర్సీ కేంద్రాల ద్వారా... పీవోలు, ఏపీవోలకు బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు.

కొవిడ్ నిబంధనలతో..

కరోనా నేపథ్యంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు. మొత్తం 81 లక్షల 88 వేల686 బ్యాలెట్ పత్రాలను ముద్రించగా... పోలింగ్ కోసం 28వేల683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో... పోలింగ్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌లతో కూడిన కిట్‌ను అందజేశారు. సిబ్బంది కొరత ఏర్పడితే... అవసరమైన పక్షంలో అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు... అధికారులు తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేవారు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని... భౌతికదూరం పాటించాలనే నిబంధన విధించారు. దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వృద్ధులు... కరోనా పాజిటివ్ వచ్చిన వారికి... పోస్టల్‌ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.

తెరాస మాత్రమే అన్నిచోట్ల..

గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా... నవాబ్ సాహెబ్‌కుంట తప్ప మిగతా 149 చోట్ల భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 146, తెలుగుదేశం 106, మజ్లిస్ 51 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో... 20 మంది బరిలో ఉంటే... ఉప్పల్, బార్కస్, జీడిమెట్ల, టోలిచౌకి, నవాబ్‌సాహెబ్ కుంటల్లో అత్యల్పంగా ముగ్గురు చొప్పున మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఇదీ చూడండి:ఓటేయాలంటే.. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరి

Last Updated : Dec 1, 2020, 5:13 AM IST

ABOUT THE AUTHOR

...view details