Dussehra Arrangements at Indrakeeladri : కరోనా తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు చేస్తోన్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల 26 నుంచి అక్టోబర్ ఐదో తేదీ వరకు పది రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం.
14 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పది రోజుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజు స్వర్ణ కవచాలంకృత అలంకరణలో మెరిసే కనకదుర్గాదేవి దర్శనం మాత్రం ఉదయం 9 గంటల తరువాతే కల్పిస్తారు.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని.. అక్టోబర్ రెండో తేదీ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వరద తీవ్రత దృష్ట్యా కృష్టా నదిలో స్నానాలు నిలిపివేత:రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ, సుమారు పది శాఖల అధికారుల ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేదించి.. ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.