BUNNY FESTIVAL IN DEVARAGATTU: కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా పండుగ రోజున జరిగే బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పండుగ రోజు ఇక్కడ జరిగే కర్రల ఉత్సవం తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. పండుగరోజు ఊరేగింపుగా బయలుదేరిన తమ ఇలవేల్పు మాల మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు రెండు జట్ల ఊళ్ల ప్రజలు పోటీ పడతారు. అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగించేందుకు మూడు గ్రామాల ప్రజలు ఒకవైపు.. ఉత్సవాలను అడ్డుకునేందుకు 9 గ్రామాల ప్రజలు మరోవైపు ఉంటూ.. ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల రోజున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.