నిజంగానే దాడికి పిలుపునిస్తే అర్వింద్ తిరిగి రాగలడా..? Jeevan Reddy on Arvind: కేంద్రంపై ఉన్న కోపానికి తోడు ఎంపీ అర్వింద్‌పై రైతులకు ఉన్న ఆగ్రహమే ఆర్మూర్ ఘటనకు కారణమని.. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు తెస్తానని మాట తప్పినందుకు రైతులు ఎంపీ అర్వింద్‌పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. దమ్ముంటే ఆపండని రెచ్చగొట్టిన ఫలితంగానే అర్వింద్‌కు ఆర్మూర్‌లో రైతులు సత్తా చూపారన్నారు. రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతేమిటని రైతులు అడిగితే వారిని గుండాలు అంటున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను నిందించినందుకు అర్వింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తా..
'పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అర్వింద్‌ను నిలదీస్తున్నారు. హామీలిచ్చి తప్పించుకుంటే భాజపా నేతలను నిలదీయకుంటే ఏం చేస్తారు..? రైతులే కాకుండా.. కల్యాణలక్ష్మీతో లబ్ధి పొందిన మహిళలు కూడా అర్వింద్‌కు చెప్పులతో స్వాగతం చెబుతారన్నారు. కేసీఆర్‌ను తిడితే అభిమానులు కచ్చితంగా తిరగబడుతారు. సీఎం కేసీఆర్ మాకు దాడుల సంస్కృతి నేర్పించలేదు. మేము నిజంగానే దాడికి పిలుపునిస్తే అర్వింద్ నిజామాబాద్ వెళ్లి తిరిగి రాగలడా..? ఆర్మూర్‌లో పోటీ చేస్తానన్న అర్వింద్ సవాల్‌ను స్వాగతిస్తున్నా. అర్వింద్‌కు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తా." -జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు విసరడం ఆపి.. దమ్ముంటే దిల్లీకి వెళ్లి పసుపు బోర్డు తీసుకురావాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అర్వింద్‌తో చర్చించడం కన్నా.. అసెంబ్లీ చప్రాసితో చర్చించడం మంచిదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు భాజపాకు తమ పవర్ ఏమిటో చూపిస్తున్నారన్నారు. భాజపాలో దుష్టచతుష్టయం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతొందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి: