ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌కు నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇప్పటి వరకు చేసిన ఖర్చుపై...నివేదిక సమర్పించేలా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ని ఆదేశించాలని కోరుతూ...రాజధాని రైతు ఇడుపులపాటి రాంబాబు మరికొందరు అనుబంధ పిటిషన్ వేశారు. రాజధానితో ముడిపడి ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అంశాల వారీగా విచారణ కొనసాగించింది. మరికొన్ని వ్యాజ్యాలను సోమవారానికి వాయిదా వేసింది. సీఎం క్యాంప్ కార్యాలయం సహా పలు ఇతర అంశాలపై గురువారం విచారణ జరపాల్సి ఉండగా ..వాటినీ సోమవారమే విచారిస్తామని స్పష్టం చేసింది.
ప్రాంతీయ అసమానతలు వస్తాయి....
మరోవైపు... పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో తమను ప్రతివాదులుగా చేర్చుకొని వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు వేసిన అనుబంధ పిటిషన్లపైనా త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీఆర్డీఏ చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాతినిథ్యం ఇవ్వడం లేదన్న పిటిషనర్లు..3 ప్రాంతాలూ అభివృద్ధి చెందకపోతే ప్రాంతీయ అసమానలు వస్తాయన్నారు. అందువల్లే ప్రస్తుత ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇపుడు ఆ చట్టాలను కోర్టు రద్దు చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్లను అనుమతించాలని కోరారు.