HIGH COURT: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని 2017లో ఆరోపించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి.... అందుకు ఆధారాలున్నాయని పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలని... ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ప్రాపర్టీ నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి మే 13వ తేదీ రాత్రి దొంగతనానికి గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు... మంత్రి కాకాణితో పాటు మొత్తం 18 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై నెల్లూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను ఏపీ హైకోర్టు ఆదేశించింది.