Ex minister Narayana Bail Petition: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంటు విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో.. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వాయిదా వేశారు. మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె.పి.వి.అంజనీకుమార్, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఆయన సోదరుడు లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది.
శుక్రవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన, ఇన్నర్ రింగ్‌రోడ్డు వ్యవహారాన్ని అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో సింగపూర్ సంస్థకు అప్పగించిందన్నారు. లింగమనేని సంస్థ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు సమీపంలో ఇన్నర్ రింగ్‌రోడ్డు వచ్చేలా పలుమార్లు ఎలైన్‌మెంట్ మార్చారన్నారు. ఆ సంస్థలు అనుచిత లబ్ధి పొందేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అప్పటి మంత్రి నారాయణ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.
మాస్టర్‌ప్లాన్ రూపకల్పన విషయంలో నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టు ఇవ్వడానికి సీఆర్‌డీఏ అప్పటి కమిషనర్ ఎన్.శ్రీకాంత్ అభ్యంతరం తెలిపారన్నారు. చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకున్న వారికి సీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం రక్షణ ఉండదన్నారు. పిటిషన్లను కొట్టేయాలని కోరారు.