భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ.. అరకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో విశాఖ నగర సందర్శనతో పాటు అరకు అందాలనూ వీక్షించొచ్చు. విశాఖ ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ..మళ్లీ అక్కడికి చేరుకోవడంతో ముగుస్తుంది. రెండు రాత్రులు, మూడు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ ధర, సందర్శనీయ స్థలాలు, ఇతర వివరాల ఈ విధంగా ఉన్నాయి.
వైజాగ్-అరకు హాలీడే ప్యాకేజీ పేరిట ఐఆర్‌సీటీసీ దీన్ని అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఎక్కడి వారైనా విశాఖపట్నం చేరుకోవడంతో ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ రూ.6,160 నుంచి (ట్రిపుల్ ఆక్యుపెన్సీ) ప్రారంభమవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,610, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15,730 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో ఉదయం టిఫిన్, రాత్రి డిన్నర్ భాగంగా ఉంటాయి. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో పికప్, డ్రాపింగ్, బస, ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ఏసీ వాహనంలో ప్రయాణం ఉంటుంది.
తొలిరోజు పర్యాటకులను విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. తొలుత హోటల్‌లో చెక్-ఇన్, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ పర్యటన ఉంటుంది. రామానాయుడు ఫిలిమ్ స్టూడియో (సోమవారం మాత్రమే), రుషికొండ బీచ్ సందర్శించొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత కైలాసగిరి, సబ్‍మెరైన్ మ్యూజియం (సోమవారం హాలీడే), బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శించొచ్చు. రాత్రికి విశాఖలోని హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.