తెలంగాణ

telangana

ETV Bharat / city

RTC charges hike : బస్సు మళ్లీ కస్సుబుస్సు.. ఆర్టీసీలో మరోసారి డీజిల్‌ సెస్‌ వడ్డన?

APSRTC: తెలంగాణ ఆర్టీసీ రెండోసారి డీజిల్‌ సెస్‌ రూపంలో టికెట్‌ ఛార్జీలను పెంచడంతో అక్కడా సవరించాలని ఏపీ ప్రభుత్వం కూడా చూస్తున్నట్లు తెలిసింది. కేవలం ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసులకే కాకుండా.. ఏపీ వ్యాప్తంగా నడిపే అన్ని సర్వీసుల్లోనూ డీజిల్‌ సెస్‌ విధించాలని అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Apsrtc
Apsrtc

By

Published : Jun 17, 2022, 10:04 AM IST

APSRTC: ప్రయాణికులపై మరోసారి వడ్డనకు ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధపడుతోంది. తెలంగాణ ఆర్టీసీ రెండోసారి డీజిల్‌ సెస్‌ రూపంలో టికెట్‌ ఛార్జీలను పెంచడంతో ఇక్కడా సవరించాలని చూస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో ఈనెల 9 నుంచి కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ. 170 వరకు దూరాన్ని బట్టి ఛార్జీలను రెండోసారి పెంచారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య తిరిగేవాటిలో తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువ ఉండగా, ఏపీ బస్సుల్లో తక్కువ ఉన్నాయి.

ఈ మేరకు కేవలం ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసులకే కాకుండా.. ఏపీ వ్యాప్తంగా నడిపే అన్ని సర్వీసుల్లోనూ డీజిల్‌ సెస్‌ విధించాలని అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఏప్రిల్‌లో రాష్ట్రంలో ఒక విడత పెంచిన డీజిల్‌ సెస్‌ వల్ల ప్రయాణికులపై ఏడాదికి రూ. 720 కోట్ల మేర భారం పడింది. ఈసారి ఎంత పెంచాలనేదానిపై ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలో సీఎం వద్ద నిర్వహించే సమావేశంలో దీనికి ఆమోదం తీసుకోవాలని భావిస్తున్నారు.

ప్రతినెలా వడ్డిద్దామా?
డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్నా, ఆర్టీసీ టికెట్‌ ధరలు పెంచకపోవడంతో సంస్థకు నష్టాలు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతి నెలా డీజిల్‌ ధరలకు అనుగుణంగా ఛార్జీలపై నిర్ణయం తీసుకునే విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. డీజిల్‌ ధరల హెచ్చు తగ్గులను బట్టి నెలలో సగటు ధర ఎంత ఉందో తేలుస్తారు. దాని ఆధారంగా ఆ తర్వాతి నెలలో ఛార్జీలను సవరిస్తారు.

అంటే ధర ఎక్కువుంటే పెంచుతారు.. లేదంటే తగ్గిస్తారు. దీనికి హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (హెచ్‌పీఐ) ప్రామాణికంగా తీసుకుంటారు. కి.మీ.కు ఎంత పెంచాలి, లేదా ఎంత తగ్గించాలనే దానిపై ఓ విధానం తీసుకురానున్నట్లు తెలిసింది. అంటే ఎప్పుడో ఒకసారి ఛార్జీలు పెంచడం కాకుండా, ప్రతి నెలా సవరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంటే నెలనెలా ఛార్జీల వాత పడే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details