ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను గౌరవించి గ్రూపు-1 ప్రధాన పరీక్షల జవాబుపత్రాలను సంప్రదాయ విధానంలోనే మూల్యాంకనం చేస్తామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో ముగించి, ఫలితాల వెల్లడికి కృషి చేస్తామన్నారు. మున్ముందు వచ్చే గ్రూపు-1 నోటిఫికేషన్ల ప్రధాన పరీక్షల జవాబుపత్రాలను డిజిటల్ విధానంలోనే మూల్యాంకనం చేయాలని కమిషన్ నిర్ణయించిందన్నారు.
‘‘ఏపీపీఎస్సీ చేపట్టిన జవాబుపత్రాల డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదు. నోటిఫికేషన్‌లో డిజిటల్ విధానంపై చెప్పనందున జవాబుపత్రాలను చేతితోనే దిద్దాలని ఆదేశించింది. కొవిడ్(covid) నేపథ్యంలో డిజిటల్ మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాం. దీనిగురించి సాధ్యమైనంత ముందుగానే అభ్యర్థులకు తెలియచేస్తూ వచ్చాం. హైకోర్టు తాజా ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే... తుదితీర్పు వచ్చేందుకు ఆలస్యం కావొచ్చు. ఈ పరిస్థితుల్లో జవాబుపత్రాలను చేతితోనే దిద్దించాలని కమిషన్ నిర్ణయించింది. డిజిటల్, సంప్రదాయ పద్ధతిలో జరిగే మూల్యంకనాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఓ ఉపాధ్యాయుడు ఆరు నెలల కిందట దిద్దిన జవాబుపత్రాన్ని మళ్లీ ఇప్పుడు దిద్దితే వచ్చే మార్కుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇది సహజం. డిజిటల్ మూల్యాంకనం పారదర్శకంగానే జరిగింది. గతంలో ఐపీఎస్, ఇతర కేడర్ల ఉద్యోగాలకు ఎంపికై... ఐఏఎస్ కోసం మళ్లీ సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్‌లోనే వెనుకబడిన వారు ఉన్నారు. ప్రశ్నపత్రం, ఇతర పరిణామాలు అనుసరించి అభ్యర్థులకు మార్కులు వస్తాయి’’
-పీఎస్సార్ ఆంజనేయులు, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి