aperc notification on short term power purchases: రాష్ట్రంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి విద్యుత్ సంస్థలు చేపట్టే స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు ఈఆర్సీ నియంత్రణలోనే చేపట్టాలని తేల్చి చెప్పింది. స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి రియల్ టైమ్, ఇంట్రాడే, ఒక రోజు ముందస్తు అంచనాలు, వారం, నెలరోజులకు సంబంధించిన కొనుగోళ్ల అంచనాల వివరాలను ఎప్పటికప్పుడు ఈఆర్సీకి తెలియచేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సాయంతో స్టేట్‌లోడ్ డిస్పాచ్ సెంటర్ వీటిని అంచనా వేయాలని స్పష్టం చేసింది. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల యూనిట్ ధర బెంచ్ మార్క్ ధరకన్నా అధికంగా ఉంటే.. డిస్కమ్‌లే భరించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది.
విద్యుత్ కొరతను తీర్చేందుకు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నందున యూనిట్ ల్యాండింగ్ కాస్ట్‌పై ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలూ ఇవ్వలేమని వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరల్ని చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న కారణంగా వినియోగదారులపై భారం పడుతోందని విద్యుత్ నియంత్రణ మండలి అభిప్రాయపడింది. అత్యవసర కొనుగోళ్ల కారణంగా ప్రతి యూనిట్ కొనుగోలు ధరపైనా ప్రభావం పడుతోందని స్పష్టం చేసింది. యూనిట్ ధరతోపాటు ట్రాన్స్ మిషన్ డీవియేషన్ ఛార్జీలుగా అదనంగా యూనిట్‌కు రూ.25 పైసలు చెల్లించాల్సి వస్తోందని ఈఆర్సీ పేర్కొంది.