తెలంగాణ

telangana

ETV Bharat / city

'అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా?' - సాకే శైలజానాథ్ లేటెస్ట్ న్యూస్

Shailaja Nath on 3 capitals: ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా మూడు రాజధానుల ఆలోచనను మానుకుని ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.

APCC Shailaja Nath
ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్

By

Published : Mar 5, 2022, 8:00 PM IST

Shailaja Nath on 3 capitals: అప్పులతో పాలన కొనసాగిస్తున్న జగన్ సర్కారుకు మూడు రాజధానులు అవసరమా? అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ఆలోచనను మానుకుని ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు.

రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, అయినా.. మంత్రులు మూడు రాజధానుల పాటే పాడుతున్నారని ఆక్షేపించారు. జంబో సలహాదారుల మాటలు విని సుప్రీం కోర్టుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఉత్తరాంధ్రలో భూములు ఆక్రమించుకున్నందునే మంత్రులు కోర్టు తీర్పును వ్యతిరేకించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: తులసి రెడ్డి

ఏపీకి మూడు రాజధానులంటూ వైకాపా ప్రభుత్వం ప్రజలను పదేపదే మోసగించడం శోచనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. దేశానికి ఒకే రాజధాని ఉందని.., ఏపీ కంటే నాలుగు రెట్లు పెద్దదైన యూపీకి ఒకే రాజధాని ఉందన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. విభజన చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్​కు ఒక రాజధాని మాత్రమే ఉండాలని గుర్తు చేశారు. ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు, రోడ్లపై గుంతలు పుడ్చలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామనటం హాస్యాస్పదమని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details