Power Cuts in Ap: ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న విద్యుత్ ఇబ్బందులు తాత్కాలికమేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనధికారిక కరెంటు కోతలు కొనసాగుతున్నాయంటూ ప్రజలూ, విపక్షాలూ ఆందోళన చేస్తున్న వేళ.. విద్యు కష్టాలపై ఆయన స్పందించారు. గృహ వినియోగానికి, వ్యవసాయ అవసరాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే.. పరిశ్రమల్లో కరెంట్ వాడకంపై ఆంక్షలు విధించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఏపీలో 230 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఉండగా.. 180 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతోందని శ్రీధర్ వెల్లడించారు.
పరిశ్రమలపై ఆంక్షలు విధించడం వల్ల.. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ భారం తగ్గుతోందని ఆయన చెప్పారు. అయినప్పటికీ.. మరో 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ నెల (ఏప్రిల్) చివరి వారం నాటికి విద్యుత్ ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని అయన చెప్పారు. మరీ అవసరమైతే తప్ప.. గృహ, వ్యవసాయ కరెంటులో కోతలు విధించొద్దని ఆదేశాలు ఇచ్చినట్టు ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు.