ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12 కార్పొరేషన్లు, 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వీటన్నింటికీ మార్చి 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఏపీ ఎస్‌ఈసీ ప్రకటన విడుదల చేసింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్చిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 2న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమవుతుంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. మార్చి 3న మధ్యాహ్నం 3 తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఒకే విడతలో కార్పొరేషన్, పురపాలక/నగర పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న అన్నిచోట్ల పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైతే మార్చి 13న రీపోలింగ్ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.
12,086 నామినేషన్లు..
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు గతేడాది మార్చి 9న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ, పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీల్లోని వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఉపసంహరణ దశ నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈనెల 21న పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం మార్చి 10 నుంచి పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీలో మొత్తం 16 కార్పొరేషన్లకు గాను 12 చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో 4 చోట్ల ఎన్నికలు జరగవు. పాలకవర్గం గడువు ముగియక కాకినాడ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరపడం లేదు. నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలు జరగడం లేదు. 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. పట్టణాల్లో 52.52 లక్షలమంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు -12
క్ర.సం | జిల్లా | కార్పొరేషన్ |
1 | విజయనగరం | విజయనగరం |
2 | విశాఖపట్నం | గ్రేటర్ విశాఖపట్నం |
3 | పశ్చిమగోదావరి | ఏలూరు |
4 | కృష్ణా | విజయవాడ |
5 | కృష్ణా | మచిలీపట్నం |
6 | గుంటూరు | గుంటూరు |
7 | ప్రకాశం | ఒంగోలు |
8 | చిత్తూరు | తిరుపతి |
9 | చిత్తూరు | చిత్తూరు |
10 | కడప | కడప |
11 | కర్నూలు | కర్నూలు |
12 | అనంతపురం | అనంతపురం |