తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎవరి వాటాలనూ తీసుకోవడం లేదు: విశ్రాంత ఇంజినీర్ల సంఘం - రాయలసీమ ఎత్తిపోతల పథకం సమస్య

రాయలసీమ ప్రాంతానికి తాగునీటిని అందించేందుకు మాత్రమే శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు ఏపీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం స్పష్టం చేసింది. వరద జలాల సమర్థ మళ్లింపే ఈ పథకం ఉద్దేశం అని తెలిపింది.

rayalaseema-lift-irrigation
రాయలసీమ ఎత్తిపోతల

By

Published : May 13, 2020, 8:21 AM IST

కరవు ప్రాంతమైన రాయలసీమకు తాగునీటిని అందించేందుకు, నాలుగేళ్లకోసారి వచ్చే వరద జలాలతో అక్కడి ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు ఏపీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రకటించింది. వరద జలాల సమర్థ మళ్లింపే ఈ పథకం ఉద్దేశం తప్ప ఎవరి హక్కులనూ, ఎవరి వాటాలనూ తీసుకోవడానికి కాదని ఏపీ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.విశ్వేశ్వరరావు, కార్యదర్శి కె.ఎల్‌.నరసింహమూర్తి తదితరులు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సంఘం అభిప్రాయపడింది.

వారి వాదన ప్రకారం..

  • రాయలసీమ ప్రాంతం 67,710 చ.కి.మీ. విస్తీర్ణంలో 5,125 గ్రామాలు, 1.64 కోట్ల జనాభాతో ఉంటుంది.
  • తక్కువ వర్షపాతం, తరచు కరవులతో అల్లాడుతోంది.
  • నాలుగేళ్లలో ఒక్కసారైనా వరద జలాలు వినియోగించుకుని రాయలసీమలో జలాశయాలను నింపేందుకు, కరవు ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు చేపడుతోంది.
  • నాగార్జునసాగర్‌ దిగువన ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు, విజయవాడ నగరానికి దీనివల్ల ముంపు బెడద తప్పుతుంది.
  • శ్రీశైలం స్పిల్‌ వే సామర్థ్యం పెంచి గరిష్ఠ వరదను జలాశయంలో నిల్వ చేసుకోవాలంటూ కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. తెలంగాణకు ఎలాంటి ఖర్చూ లేకుండానే ఆ సిఫార్సు సాకారమవుతుంది.
  • తెలంగాణ ప్రభుత్వమూ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు వరద జలాల వాడకంతో పాటు వాటి సామర్థ్యం పెంపు, దిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ప్రాజెక్టులకు 178.9 టీఎంసీల వరద జలాలను వినియోగించుకోనుంది.
  • తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కేటాయింపులను సరిగా వాడుకోవాలన్నా కొత్త పథకం అవసరమే. ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో 2016 జూన్‌ 19న కుదిరిన ఒప్పందం ఐదేళ్లుగా అమలవుతోంది.

ABOUT THE AUTHOR

...view details