తెలంగాణ

telangana

ETV Bharat / city

మాజీ ఐఏఎస్​ పీవీ రమేశ్​ సోదరుడు రాజశేఖర్​ జోషి అదృశ్యం - ap police try to give notice to senior ias pv Ramesh

మాజీ ఐఏఎస్‌ పీవీ రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ క్రీస్తురాజపురంలోని రాజశేఖర్‌ జోషి ఇంటికి వెళ్లిన పోలీసులు..ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. భార్య ఫిర్యాదుతో రాజశేఖర్‌ జోషికి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. కాగా..రాజశేఖర్‌ను పోలీసులే తీసుకెళ్లారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మాజీ ఐఏఎస్​ పీవీ రమేశ్​ సోదరుడు రాజశేఖర్​ జోషి ఇంటికి పోలీసులు
మాజీ ఐఏఎస్​ పీవీ రమేశ్​ సోదరుడు రాజశేఖర్​ జోషి ఇంటికి పోలీసులు

By

Published : Feb 5, 2022, 10:41 PM IST

వరకట్న వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ సోదరుడు రాజశేఖర్‌ జోషికి నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ పటమట పోలీసులు ప్రయత్నించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ క్రీస్తురాజపురంలో రాజశేఖర్‌ ఉంటున్న ఇంటికి ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. రాజశేఖర్‌ కనిపించడం లేదని, పోలీసులే తీసుకెళ్లారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇంటికి వెళ్లిన సమయంలో ఎవరూ లేకపోవడంతో తిరిగి వచ్చారు. మళ్లీ శనివారం కూడా 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. చుట్టుపక్కల వారిని అడిగినా తెలియదని చెప్పడంతో వెనుదిరిగినట్లు పటమట పోలీసులు చెబుతున్నారు. కాగా..రాజశేఖర్‌ను పోలీసులే తీసుకెళ్లారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ చెప్పాలని జోషి తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు. తమ కుమారుడి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి.. గత నెల 19వ తేదీన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసం ఉంటున్న రాజశేఖర్‌ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వెళ్లి విచారణ కోసం జనవరి, 22న పటమట స్టేషనుకు రమ్మని తాఖీదులు అందజేశారు. రమేష్‌ సోదరి అరుణకు వాట్సాప్‌లో పంపించారు. కొవిడ్‌ మూడో ఉద్ధృతి కారణంగా తాము వ్యక్తిగతంగా హాజరు కాలేమని వీరు పటమట పోలీసులకు వర్తమానం అందించారు. ఈ కేసులో రాజశేఖర్‌ జోషిపై స్టే ఉండడంతో అప్పట్లో అతనికి నోటీసులు ఇవ్వలేదు. కాకినాడలోని ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్‌ జోషికి 1999లో సంధ్యతో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త, అత్త, మామ, ఆడపడుచులు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని సంధ్య, 2018లో పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ. 2 లక్షల నగదు, 4 ఎకరాల మామిడి తోట, ఇంటి సామాను, మారుతి కారు అందజేశారని ఆమె అందులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఏ1గా భర్త రాజశేఖర్‌ను, ఏ2గా మామ సుబ్బారావు, ఏ3గా అత్త మణి, ఏ4గా ఆడపడుచు అరుణలపై 498-ఏ ఐపీసీ, వరకట్న నిరోధక చట్టం సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు.


ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details