తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పురపోరు: పోలింగ్​కు కౌంట్​డౌన్ స్టార్ట్..! - AP Politics Latest News

ఏపీలో పుర, నగరపాలక సంస్థలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. పురఎన్నికల ప్రశాంత నిర్వహణకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి పట్టణ ఎన్నికను జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా సిద్ధం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్‌కు అవసరమైన భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ మొదలు.. రూట్​ మ్యాప్​ను రెవెన్యూ, పురపాలక అధికారులు సిద్ధం చేశారు.

ap-municipal-elections-countdown-starts-for-polling
పురపోరు: పోలింగ్​కు కౌంట్​డౌన్ స్టార్ట్..!

By

Published : Mar 9, 2021, 8:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లో నగర, పురపాలక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఇందుకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత చర్యలు చేపట్టారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మంగళవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని.. మిగతా ఏర్పాట్లు చేసుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల డిస్టెన్స్ అమలు దగ్గర్నుంచి.. ఇతర అన్ని ఏర్పాట్లు మంగళవారం రాత్రి వరకు పూర్తి కానున్నాయి.

గెలుపే లక్ష్యంగా..

పుర, నగరపాలక ఎన్నికలు పార్టీల గుర్తుపై జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైకాపా, తెదేపా, భాజపా - జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో.. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలు పోటీలో ఉన్నా.. పోరు మాత్రం అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య ఉన్నట్టు చర్చ జరుగుతోంది. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో.. రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.!

ఏపీ వ్యాప్తంగా 75 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అయితే ఏలూరులో ఓటర్ల జాబితాలో అవకతవలు జరిగాయని కొంతమంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సింగిల్​ జడ్జి బెంచ్​ ఎన్నికను వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం, ఇతరులు హైకోర్టులో పిటిషన్​ వేయగా.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌ సస్పెండ్ చేసింది. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. మార్చి 14న ఓట్ల లెక్కింపు చేపట్టి పుర ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

కిందటి ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15కు వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది.

ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు:విశాఖ, విజయనగరం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఏలూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం

జిల్లాల వారీగా ఎన్నికలు జరిగే మున్సిపల్‌, నగర పంచాయతీలు..

శ్రీకాకుళం ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ
విజయనగరం బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల
విశాఖపట్నం నర్సీపట్నం, యలమంచిలి
తూర్పుగోదావరి అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం
పశ్చిమగోదావరి నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం
కృష్ణా నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు
గుంటూరు తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల
ప్రకాశం చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు
నెల్లూరు వెంకటగిరి, ఆత్మకూర్‌(ఎన్‌), సూళ్లూరుపేట, నాయుడుపేట
అనంతపురం హిందూపూర్‌, గుంతకల్‌, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర
కర్నూలు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు‌, డోన్‌, నందికొట్కూరు‌, గూడూరు‌(కె), ఆళ్లగడ్డ, ఆత్మకూర్‌‌(కె)
కడప(వైఎస్‌ఆర్‌) ప్రొద్దుటూరు‌, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్‌, రాయచోటి, మైదుకూర్‌, యర్రగుంట్ల
చిత్తూరు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు

ABOUT THE AUTHOR

...view details