తెలంగాణ

telangana

ETV Bharat / city

Water dispute: 'రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకుంటాం' - రాజలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వ్యాఖ్య

సాగు నీటిపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు... సరికాదని మంత్రులు పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకోనున్నాం అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. రాజకీయాల కోసమే అక్కడి మంత్రుల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ap ministers comments on telangana leaders
'రాష్ట్రానికి కేటాయించిన నీటినే వాడుకోనున్నాం..'

By

Published : Jun 26, 2021, 9:18 AM IST

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలనే వాడుకోనున్నామని మంత్రులు పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రులు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌.. ఇలా అన్నింటా... అక్రమంగా ఒక గ్లాసుడు నీళ్లు కూడా తీసుకునే ఆలోచన సీఎం జగన్‌ చేయడం లేదు. రాజకీయ ఘర్షణ, భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల రెండు రాష్ట్రాలకు దమ్మిడీ ఉపయోగం లేదు. మేం ఎవరితోనూ తగాదాలు కోరుకోవడం లేదు. పొరుగున ఉన్న ఏ రాష్ట్రంతో అయినా సామరస్యంగానే వ్యవహరిస్తాం’ అని మంత్రి పేర్ని నాని విజయవాడలో పేర్కొన్నారు. ఎవరి అవసరం వారిదని, తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు వారి రాజకీయ అవసరాల కోసం చేసినవన్నారు. ‘భాజపాకు, మాకు పగలుకు, రాత్రికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. రాజకీయంగా ఒకే మార్గంలో ఉండం. ఆ పార్టీ ఇక్కడ మాకు వ్యతిరేకం. అయినా కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉండటంతో సామరస్యంగా ఉంటాం’ అని తెలిపారు.

అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం లేదు

రాయలసీమకు తాగు, సాగునీటిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి అక్రమ ప్రాజెక్టులూ నిర్మించడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం ఏపీకి ఎన్ని టీఎంసీలు కేటాయించారో వాటినే తీసుకుంటామని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాం నుంచి అక్రమంగా పంపింగ్‌ ఎప్పుడూ చేయమని, పోతిరెడ్డిపాడుకు ఎగువన అధికంగా వచ్చే నీటినే తీసుకుంటామని వివరించారు. కరవు ప్రాంతం రాయలసీమకు తాగు, సాగునీటిని అందించడానికి పూర్తిగా సహకరిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏపీ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని పెద్దిరెడ్డి తెలిపారు.

జగన్‌ని ఎందుకు తిడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు..

‘రాయలసీమ తీవ్ర దుర్భిక్ష ప్రాంతం. మన హక్కుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కాపాడుకుంటాం. అదే బాధ్యతను సీఎం జగన్‌ తీసుకున్నారు. రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం సరికాదు’ అని మంత్రి కన్నబాబు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ..‘తెలంగాణ మంత్రి మాట్లాడిన మాటలు సంస్కారానికి సంబంధించిన విషయం. ప్రజలు హీరో అనుకుంటారని తిడితే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. తెలంగాణ నేతలు ఏమి మాట్లాడుతున్నారో.. జగన్‌ని ఎందుకు తిడుతున్నారో అక్కడి ప్రజలు అర్థం చేసుకోగలరు?’ అని అన్నారు.

ఇదీ చదవండి:Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్‌ దాటిన కరోనా టీకా పంపిణీ

ABOUT THE AUTHOR

...view details