తెలంగాణ

telangana

ETV Bharat / city

'కలల రాజధాని కాదు... అభివృద్ధి, సంక్షేమమే మాకు ముఖ్యం' - జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక

రాజధానిపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక మంత్రివర్గం ముందుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్​ మంత్రి పేర్ని నాని వివరించారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని చెప్పారు. పంచాయతీరాజ్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించారు. కొత్త వ్యవసాయ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు.

ap minister perni-nani talks on gn rao committee
'కలల రాజధాని కాదు... అభివృద్ధి, సంక్షేమమే మాకు ముఖ్యం'

By

Published : Dec 27, 2019, 4:44 PM IST

'కలల రాజధాని కాదు... అభివృద్ధి, సంక్షేమమే మాకు ముఖ్యం'

ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం చేసిన తప్పులను మంత్రి మండలి ఉపసంఘం గుర్తించిందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు భూములు కొన్నారన్న మంత్రి... సీఆర్‌డీఏ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమికంగా గుర్తించిందని చెప్పారు.

రాజధానిపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక మంత్రివర్గం ముందుకు వచ్చిందని మంత్రి పేర్ని నాని వివరించారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని చెప్పారు. నగరాభివృద్ధి, పట్టణీకరణకు సంబంధించిన నిపుణులు జీఎన్‌రావు కమిటీలో ఉన్నారని తెలిపారు. రాజధాని పట్టణీకరణపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు.

జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికల ఆధారంగా ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ కాదని అప్పటి మంత్రి నారాయణ కమిటీ నివేదిక ఆధారంగా భూసమీకరణ చేపట్టారని చెప్పారు. ప్రాథమికంగా 32 వేల ఎకరాలు, మరో 20 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయించారని వివరించారు.

ప్రపంచం ఈర్ష్య పడేలా రాజధాని నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వం భావించిందన్న మంత్రి పేర్ని నాని... వాస్తవాలను మరచి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంకల్పించిందని ఆరోపించారు. లక్షా 9 వేల కోట్లు పెట్టుబడులు అవసరమని భావించి... కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగిందని పేర్కొన్నారు. వాస్తవ అంచనాలు లేకుండా గత ప్రభుత్వం ముందుకెళ్లిందని చెప్పారు.

అనుభవజ్ఞులైన గత సీఎం లక్ష కోట్లు అప్పు తెస్తామని 5 వేల కోట్లు మాత్రమే తేగలిగారని విమర్శించారు. రూ.లక్ష కోట్లు తేవాలంటే ఎంతకాలం పడుతుందో ప్రజలు అంచనా వేసుకోవాలని కోరారు. ఐదేళ్లకు రూ.5 వేల కోట్లు చొప్పున ఖర్చుపెడితే ఎప్పటికి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ప్రశ్నించారు. గత ఆర్థిక మంత్రి 'మేమే తేగలిగినంత తెచ్చాం' ఇంకెవరు అప్పు ఇస్తారని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని... కలల రాజధాని అంత ప్రాధాన్యాంశం కాదన్నారు.

పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాలకు ప్రతి ఏడాది మద్దతు ధర ముందే ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. 108 సర్వీసులు అనేక సమస్యల్లో ఉన్నాయన్న పేర్ని నాని... 412 సరికొత్త 108 వాహనాలు కొనడానికి రూ.78 కోట్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 656 కొత్త 104 వాహనాలు కొనడానికి రూ.60 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.

కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్‌ బోర్డుకు 4 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్నినాని వివరించారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు మంత్రివర్గంలో తీర్మానం పెట్టినట్టు చెప్పారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వీలుగా కృష్ణపట్నం ముఖద్వారం కుదింపు నిర్ణయం తీసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details