ప్రతిదీ పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పు అవుతుందని ఏపీ మంత్రి అనిల్‌కుమార్ ప్రశ్నించారు. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా ఒకటేనని పేర్కొన్నారు.
‘‘పవన్‌కల్యాణ్ కోసం మేము ఇండస్ట్రీని భయపెట్టాలా? ఇదంతా ఏంటి? అసలు ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయి? అదేమంటే ఒకటితో మొదలు పెట్టాం అంటారు. మొన్న జరిగిన జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఒక మండలంలో గెలిచారు. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లేసరికి పార్టీ చాప చుట్టేస్తుంది. నిర్మాణాత్మక విమర్శలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఈ విధానమైతే సరికాదు. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం చాలామందిని చూసింది. సోషల్‌మీడియాలో వాళ్లకు అభిమానులు ఉంటారు. వాళ్లు ట్రోలింగ్ చేయడం మొదలుపెడతారు. మా గురించి ఎన్ని ట్రోల్స్ చేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే మమ్మల్ని తలుచుకుంటున్నందుకు ధన్యవాదాలు. కేవలం ఆయనను దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమను ఎందుకు ఇబ్బంది పెడతాం? అసలు ఆయనెవరు? ఆయన వాదనల్లో పొంతన లేదు. మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేట్లు పెంచుతాం కదా! కానీ, అలా చేయడం లేదు. సినిమా థియేటర్లు ఏమైనా మూసేశామా? రేట్లు పెంచి అమ్మే టికెట్లపై ట్యాక్స్ ఎక్కడికిపోతోంది? ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆన్‌లైన్ టికెటింగ్‌పై నిర్ణయం తీసుకున్నారు. దానిలో తప్పేముంది? అదే రూ.200 పెట్టి పోర్టల్‌లో టికెట్లు అమ్మడం, ప్రతిదీ పారదర్శకంగా జరగాలనుకోవడం తప్పా’’
-అనిల్‌కుమార్, మంత్రి