AP Letter to KRMB: విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడాన్ని నిలుపుదల చేసేలా చూడాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల కోసం నీటి విడుదలకు నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిలువరించాలని ఆయన లేఖలో కోరారు.
‘తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని విడుదల చేస్తోంది. ఇలా చేస్తూ పోతే ఆ నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వదిలేసే పరిస్థితులు ఏర్పడతాయి. సాగర్ దిగువ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నందున ప్రాజెక్టులో నీటిని భద్రపరుచుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సాగర్ నీటితో జల విద్యుదుత్పత్తి చేయకుండా నిలువరించాలి’ అని జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి కేఆర్ఎంబీకి లేఖ రాశారు.