ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో జస్టిస్ రాకేశ్‌కుమార్ విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ... ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిషన్ బిల్డ్ ఏపీ స్పెషల్ అధికారి ప్రవీణ్‌కుమార్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసిన విషయం తెలిసింది. తాజాగా జరిగిన విచారణలో ఐఏ వేశామని అదనపు ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సంబంధిత దస్త్రాన్ని తమకు అందజేయకుండా.. నేరుగా హైకోర్టులో దాఖలు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, వి.నళిన్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ముందుగా మీడియా ఆ విషయాన్ని ప్రచురించిందన్నారు. కౌంటర్ ప్రతిని సైతం తమకు ఇవ్వలేదని కొంతమంది న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
'ఇక్కడ ఎవరు ఎవరికి లేఖ రాసినా పత్రికా సమావేశంలో చెబుతారు' - AP High Court comments on mission build ap
మిషన్ బిల్డ్ ఏపీ పథకం ద్వారా విశాఖ, గుంటూరు జిల్లాల్లో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ స్థలాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించే ప్రయత్నాన్ని సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం అదనపు ఏజీ సుధాకర్ రెడ్డికి స్పష్టం చేసింది. మౌనంగా ఉండాలని తేల్చిచెప్పింది. న్యాయ విచారణలో జోక్యం చేసుకున్న వాళ్లపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభిస్తామని హెచ్చరించింది.
ఏపీ ధర్మాసనం స్పందిస్తూ... ఈ రాష్ట్రంలో ఎవరు ఎవరికి లేఖ రాసినా పత్రికా సమావేశంలో చెబుతారని.. ఆ విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించింది. అదనపు ఏజీ తాము కౌంటర్ ప్రతుల్ని అందజేశామన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లు ఈ కోర్టును స్వర్గధామంగా భావిస్తున్నారన్నారు. న్యాయమూర్తి మాట్లాడుతుండగా.. అదనపు ఏజీ జోక్యం చేసుకోవడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో దాఖలు చేసిన దస్త్రాలను అవతలి కక్షిదారులకు అందజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందజేయని పక్షంలో ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది.