AP High Court on Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడు, మృతుడి మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సమర్థించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించడాన్ని సవాలుచేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి (ఏ1), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. నిందితుల నేర నిరూపణకు ప్రత్యక్షసాక్ష్యం కావాలనే ఉద్దేశంతో దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని కడప కోర్టును సీబీఐ అభ్యర్థించిందని తెలిపింది. సరైన సాక్ష్యాలు లేనందున నేరగాళ్లు తప్పించుకోకుండా ఉండేందుకే సీబీఐ ఇలా వ్యవహరించిందని వివరించింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఈమేరకు కీలక తీర్పునిచ్చారు.
ప్రత్యక్ష సాక్ష్యం సేకరించలేకపోయారు: న్యాయమూర్తి
Viveka Murder Case Updates : ‘కోర్టు ముందున్న రికార్డులను బట్టి.. ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్‌యాదవ్ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి.. వివేకాను హతమార్చేందుకు ప్రేరణ కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి కొందరు నిందితులు వ్యతిరేకంగా పనిచేశారని వివేకా భావించారు. కడప ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలోనూ నిందితులతో వివేకాకు వివాదముంది. వివేకాకు దస్తగిరి పూర్వ వాహన డ్రైవర్ కావడంతో మిగిలిన నిందితులు రూ.5 కోట్లు ఆఫర్ చేసి హత్యకు ప్రణాళిక రచించారు. 2019 మార్చి 14/15వ తేదీన హత్య జరిగినప్పటికీ స్థానిక పోలీసులు, సిట్, సీబీఐ దర్యాప్తులలో కేసుకు సంబంధించిన ‘ప్రత్యక్ష సాక్ష్యం’ సేకరించలేకపోయారు. గంగిరెడ్డి ఆరోజు వివేకాతో ఇంట్లో రాత్రి కలిసి ఉండటం, మిగిలిన నిందితులు అర్ధరాత్రి ఇంట్లోకి రావడం, ఇంట్లోనుంచి కొన్ని శబ్దాలను వినడం, కాసేపటికి నిందితులు నలుగురు ఇల్లువిడిచివెళ్లడం చూశానన్న మేరకే వాచ్‌మెన్ రంగన్న సాక్ష్యం ఉంది’ అని న్యాయమూర్తి వివరించారు.