తెలంగాణ

telangana

ETV Bharat / city

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు - AP High Court on CRDA cancellation

AP High Court News: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు వినడం ఇప్పటికే పూర్తి కావటంతో.. సీజే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇవ్వనుంది.

AP capital issue
AP capital issue

By

Published : Mar 3, 2022, 8:28 AM IST

AP High Court News: రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిలో ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెల్లడించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ(మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం(యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది.

రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో..

AP High Court on CRDA : మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో దాని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని విన్నవించారు. మూడు రాజధానుల నిర్ణయానికి ఆధారమైన కమిటీ నివేదికలను రద్దు చేయాలని, రాజధానిని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించాలన్నారు. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాన్ని కొనసాగించాలని, సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. గురువారం తీర్పు ఇవ్వనుంది.

ABOUT THE AUTHOR

...view details