అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలోని కొందరు ఉద్యోగుల రక్తంలో సీసం(లెడ్) శాతం అధికంగా ఉండటంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించరా? అని యాజమాన్యాన్ని ప్రశ్నించింది. పరిశ్రమలో పీసీబీ అధికారులు చేపట్టిన తనఖీ నివేదిక, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఇచ్చిన లేఖను కోర్టు ముందు ఉంచాలని ఏపీ పీసీబీ, ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పొడిగించింది.
విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. పర్యావరణ నిబంధనలను పాటించలేదన్న కారణంతో పరిశ్రమ మూసివేత నిమిత్తం పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ అధీకృత అధికారి నాగుల గోపీనాథ్‌రావు హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవి గురువారం విచారణకు వచ్చాయి.