కళాశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించే బోధన రుసుములను (ఫీజు రీయింబర్స్మెంట్) తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ఇక నుంచి విద్యార్థుల తరఫున సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. తల్లుల ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పించే జీవో 28ని రద్దు చేసింది. మరో జీవో 64లోని నిబంధనలను కొట్టేసింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన నగదును కళాశాలలకు చెల్లించేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. ఆయా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
త్రైమాసికానికి ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసిన సొమ్మును 40% మంది కళాశాలలకు చెల్లించలేదని గుర్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తల్లులు చెల్లించకపోతే కళాశాలలు చదువు చెప్పలేవని తెలిపింది. తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. లేదా? మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా? అని పరిశీలించే అవకాశం తల్లిదండ్రులకు కల్పించారని గుర్తు చేసింది. లోపాలుంటే కళాశాలలపై ఫిర్యాదు చేసే హక్కును తల్లిదండ్రులకు ఇచ్చారని వెల్లడించింది. తల్లులు రుసుము చెల్లించకపోతే ఆ విద్యార్థి కళాశాలలో కొనసాగే అంశంపై జీవో పేర్కొనలేదని ఆక్షేపించింది. కళాశాలల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తే విద్యార్థులు మధ్యలో చదువుకు దూరమయ్యే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. తద్వారా పథకం ఉద్దేశం నెరవేరదని తెలిపింది. అందువల్ల తల్లుల ఖాతాలో ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము జమ చేసేందుకు వీలు కల్పిస్తున్న జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.