High Court on IAS Officers Appeal Petition: ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో సామాజిక సేవ శిక్ష విధిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును వారిద్దరి విషయమై 8 వారాలు నిలుపుదల చేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణను జూన్ 20కి వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు విధించిన సామాజిక సేవ శిక్షను సవాల్ చేస్తూ... ఐఏఎస్ అధికారులు.. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్... ధర్మాసనం వద్ద వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీ ధ్రువీకరించిన పత్రం లేకుండా... అప్పీల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ముందు ఐఏఎస్ అయినా... సామాన్య ప్రజలైనా ఒక్కటేనని తేల్చిచెప్పింది. సర్టిఫైడ్ కాపీని జతచేస్తేనే విచారణ చేస్తామని స్పష్టం చేసింది.