Andhra pradesh High Court on drugs case: మాదక ద్యవ్యాల నిరోధక చట్టం కింద నమోదవుతున్న నేరాలు సమాజంపై ప్రభావం చూపుతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఎన్డీపీఎస్(NDPS) చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏపీ డీజీపీ క్రమం తప్పకుండా ప్రత్యేక విభాగంతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టంచేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సంప్రదింపులు జరుపుతుండాలని పేర్కొంది . ఏపీలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో గంజాయి సాగుచేస్తున్నట్లు కనిపిస్తోందని... ఇది చట్ట విరుద్ధమని , కేసు నమోదు అయితే బెయిలు పొందడం అంత సులువుకాదనే విషయం అక్కడి వారికి తెలియదని వ్యాఖ్యానించింది. ఆ ప్రాంతాల్లో పోలీసులు అవగాహన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరచాలని ఆదేశించింది. అలాగే వారికి ఉపాధి మార్గాలు కల్పించే అంశాన్ని అన్వేషించాలని స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో పోలీసులు, ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులు, పీపీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. సంబంధిత ప్రతి... ఏపీ హైకోర్టు వెబ్సెట్లో అందుబాటులో ఉంది. ఎన్డీపీఎస్ కింద విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులైన లారీ డ్రైవర్, క్లీనర్‌కు బెయిల్ మంజూరు చేశారు.
180 రోజుల్లోనే చేయాలి..
ఎన్టీపీస్ చట్టం కింద నమోదైన కేసుల్లో(ap high court on ntps act) అభియోగపత్రం 180 రోజుల్లో దాఖలు చేయకపోతే నిందితులకు డిఫాల్డ్ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయలేనప్పుడు .. నిందితుల రిమాండ్ సమయాన్ని పొడిగించాలని పోలీసులు సంబంధిత కోర్టులో దరఖాస్తు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. నిందితుల రిమాండ్ సమయం పొడిగించాలని దిగువ కోర్టుల్లో దరఖాస్తులు చేయడం లేదనే విషయాన్ని ఉత్తర్వుల ఆధారంగా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికి చర్యలు లేవని న్యాయమూర్తి తప్పుపట్టారు.