తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టుకు భాజపా.. - ap zptc mptc elections 2021

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది ఆ రాష్ట్ర భాజపా. ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించేలా ఆదేశించాలని పిటిషన్​లో కోరింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం... కౌంటర్లు వేయాలని ఎస్ఈసీతో పాటు పంచాయతీరాజ్​శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

ap high court, andhra pradesh
హైకోర్టు, ఏపీ హైకోర్టు

By

Published : Apr 3, 2021, 8:59 AM IST

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించేలా ఆదేశించాలంటూ భారతీయ జనతా పార్టీ(భాజపా), మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్లు వేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విచారణను శనివారానికి వాయిదా వేసింది. అత్యవసరంగా దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గా ప్రసాదరావు ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ, నిలిచిపోయిన దగ్గర్నుంచి ప్రక్రియను ప్రారంభిస్తామని గతేడాది మార్చిలో ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రకటనతోపాటు, అదే ఏడాది మే 6న ఇచ్చిన మరో నోటిఫికేషన్‌పై భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న మరో ముగ్గురు యువకులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయా నోటిఫికేషన్లకు అనుగుణంగా తదనంతరం జరిగే ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

కౌంటర్‌ వేస్తాం సమయం ఇవ్వండి: ఎస్‌ఈసీ

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించకపోవడాన్ని సవాలు చేశామన్నారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ను ఆ బాధ్యతల నుంచి మారుస్తూ ఈనెల 1న రాత్రి ఉత్తర్వులిచ్చినట్లు తెలిసిందన్నారు. న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ... తాను ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిగా నియమితమయ్యానని, తన తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తారన్నారు. మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఈనెల 1న పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీచేశామన్నారు. ప్రస్తుత వ్యాజ్యంలో కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని, మంగళవారం(6న) విచారణ చేపట్టాలని కోరారు. పంచాయతీరాజ్‌శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్‌ స్పందిస్తూ ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను కోర్టుకు తెలిపారు. ఈనెల 8న ఎన్నికలు ఉంటాయన్నారు.

సమయం కోరడంపై అభ్యంతరం..

విచారణను మంగళవారం చేపట్టాలని ఎస్‌ఈసీ కోరడంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. అత్యవసరమున్న ఇలాంటి వ్యాజ్యాల్లో కౌంటర్‌ వేసే కారణంతో వాయిదా కోరడం సరికాదన్నారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి... శనివారం మధ్యాహ్నం విచారణ చేస్తామన్నారు.

పిటిషన్‌లో ఏముందంటే...

  • రెండు, మూడు నెలల్లో కరోనా అదుపులోకి వస్తుందని భావించిన ఎస్‌ఈసీ... ఆరు వారాల తర్వాత లేదా కరోనా తగ్గాక నిలిచిపోయిన దగ్గర్నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంఅవుతుందని గతేడాది మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
  • ఎన్నికలు వాయిదా వేసి ఇప్పటికే ఏడాది గడిచినందున మొదటి నుంచీ ప్రక్రియ ప్రారంభించాలి.
  • ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చే అధికారం ఎస్‌ఈసీకి ఉంటుంది.
  • మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించకుంటే... పోటీ చేసేందుకు వయసు రీత్యా తాజాగా అర్హత పొందిన వారికి అవకాశం ఉండదు. ఇది రాజ్యాంగ విరుద్ధం.
  • నిలిచిపోయిన దగ్గర్నుంచి పరిషత్‌ ఎన్నికలు ప్రారంభిస్తామంటూ నోటిఫికేషన్‌లో పేర్కొనడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి.

ఇదీ చదవండి :పంజా విసురుతున్న కొవిడ్.. ఐసీయూలలో చేరికలు అధికం‌

ABOUT THE AUTHOR

...view details