తెలంగాణ

telangana

ETV Bharat / city

AP High court on Transgenders: 'ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై అధ్యయనం చేయండి'

AP High Court on Transgenders petition: ఏపీలో ఎంత మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు? వారికి కల్పిస్తున్న ప్రయోజనాలేంటి?, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? అనే విషయాలపై అధ్యయనం చేయాలని ఆ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేని స్పష్టం చేసింది.

AP High Court on Transgenders petition
ట్రాన్స్​జెండర్ల పిటిషన్​పై హైకోర్టు

By

Published : Jan 27, 2022, 12:41 PM IST

AP High Court on Transgenders petition: ఆంధ్రప్రదేశ్​లో ట్రాన్స్‌జెండర్లు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? వారికి కల్పిస్తున్న ప్రయోజనాలేంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోతే ఎంతమేర రిజర్వేషన్‌ కల్పించాలనే విషయాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు నెలల్లో ఉత్తర్వులు అమలు చేయాలని తేల్చిచెప్పింది.

‘రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లు కొద్ది సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీలో వారికి నైష్పత్తిక ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ దరఖాస్తులో సైతం లింగ గుర్తింపును పేర్కొనేందుకు ప్రత్యేక స్థలం కేటాయించడం లేదు. ఇది ప్రభుత్వ అనాలోచిత చర్య మాత్రమే కాదు.. ఉద్యోగ అవకాశాల్లో స్త్రీ, పురుషులతో సమానంగా ట్రాన్స్‌జెండర్లు అవకాశాలు పొందే హక్కును నిరాకరించడమూ అవుతుంది. ట్రాన్స్‌జెండర్లలో ఎక్కువ మంది భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు వారి సమస్యలను పట్టించుకోవడం లేదు’అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు.

ఇదీ నేపథ్యం

2018 నవంబరు 1న ఎస్సై ఉద్యోగ ప్రకటనలో తమకు రిజర్వేషన్‌ కల్పించలేదంటూ ట్రాన్స్‌జెండర్‌ ఎం.గంగాభవాని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్​ తరఫు న్యాయవాది సాల్మన్‌రాజు వాదనలు వినిపిస్తూ.. ఈ ఉద్యోగ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. పిటిషనర్‌ పురుషుడిగా పుట్టి, లింగమార్పిడి శస్త్రచికిత్సతో ట్రాన్స్‌జెండర్‌గా మారారని చెప్పారు. ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్‌ ఐచ్ఛికం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్త్రీగా పేర్కొంటూ దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ప్రాథమిక రాతపరీక్ష రాశారని.. బీసీగా రెండు పేపర్లలో 35 శాతం మార్కులు పొందారని వివరించారు. అయితే అధికారులు తర్వాత ప్రక్రియకు పిటిషనర్‌ అనర్హులని ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించామని చెప్పారు. పోలీసు నియామక బోర్డు తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ పుట్టుకతో పురుషుడని, తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారారని చెప్పారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ కోరలేదని.. వివిధ కేటగిరీ కింద పేర్కొన్న ప్రకారం పిటిషనర్‌ మార్కులు పొందలేదని వాదించారు. ట్రాన్స్‌జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

పిటిషన్‌ కొట్టివేత

వాదనలు విన్న హైకోర్టు.. ట్రాన్స్‌జెండర్లను సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పేర్కొంటూ, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేసింది. అయితే ఇంత శాతం రిజర్వేషన్‌ సృష్టించాలని నిర్దిష్టంగా చెప్పలేదని పేర్కొంది. వారికి రిజర్వేషన్‌ సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లకు ఎస్సై నియామకాల్లో రిజర్వేషన్‌ కల్పించడంలో విఫలమైనందున అధికారులకు కోర్టు ధిక్కరణ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఈ కారణంగానే ఆ నోటిఫికేషన్‌ చెల్లుబాటుకాదని ప్రకటించలేమంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం.. 35 వర్సిటీల ధ్రువపత్రాలు ఫోర్జరీ!

ABOUT THE AUTHOR

...view details