ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.
ఏపీ సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట - ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారం
17:28 March 19
ఏపీ సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట
సీఆర్‌డీఏ చట్టం ద్వారా తీసుకొచ్చిన జీవో చెల్లదనడం సరికాదని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదించారు. ఐపీసీ 166, 167 సెక్షన్లు ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసుపెట్టాలని.. ఫిర్యాదులో ఉండే ఆరోపణలకు, పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జీవో విడుదలైన 35 రోజులకు అప్పటి సీఎం ఆమోదించారని చెబుతున్నారని.. అప్పటి సీఎంకు తెలిసి జీవో ఇచ్చారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు కుదరదని.. నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని లూథ్రా గుర్తు చేశారు. అప్పటి సీఎం, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదని.. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.
అప్పటి గుంటూరు కలెక్టర్ విజ్ఞప్తితో జీవోను సవరించారని నారాయణ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవోపై చర్చలు, విడుదల ప్రక్రియలో అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదన్నారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని చెప్పారు. వ్యక్తిగతంగా వెళ్లి నష్టం కలిగిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయన్నారు. జీవో ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తే కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చిందని దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఆధారాలు చూపించండి..
మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఐడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ చంద్రబాబు, నారాయణపై నమోదు చేసిన కేసులో ఆధారాలు చూపించాలని సీఐడీని ఆదేశించింది. కేసు ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ప్రశ్నించింది. దీనిపై సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని.. పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సీఐడీ విచారణపై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.