తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో గరిష్ఠ స్థాయికి విద్యుత్ వినియోగం.. యూనిట్‌ ధర రూ.20 - Electricity Usage in AP

Electricity Usage in AP : ఏపీలో విద్యుత్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరింది. దాంతో యూనిట్‌ రూ.20కి డిస్కంలు కొనుక్కోవాల్సి వస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి రోజూ గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ 11వేల మెగావాట్లకు తగ్గడం లేదు.

Electricity Usage in AP
Electricity Usage in AP

By

Published : Mar 30, 2022, 8:50 AM IST

Electricity Usage in AP : ఏపీలో విద్యుత్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో సాయంత్రం గరిష్ఠ వినియోగం సమయంలో యూనిట్‌ రూ.20కి డిస్కంలు కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ నెల 17న గ్రిడ్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో 11,694 మెగావాట్లుగా నమోదైంది. 2021 మార్చి 11న నమోదైన 10,724 మెగావాట్లు ఇప్పటివరకు గరిష్ఠ డిమాండ్‌గా ఉంది. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం, ఉష్ణోగ్రతలు పెరగటంతో విద్యుత్‌ వాడకం పెరుగుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి రోజూ గ్రిడ్‌ గరిష్ఠ డిమాండ్‌ 11వేల మెగావాట్లకు తగ్గడం లేదు.

పెరిగిన విద్యుత్‌ కొనుగోలు వ్యయం:రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఆదివారం 230.22 మిలియన్‌ యూనిట్లకు (ఎంయూ) చేరింది. వారం రోజులుగా డిమాండ్‌ 225-230 ఎంయూల మధ్య ఉంటోంది. జెన్‌కో, హిందూజాల నుంచి 86.64 ఎంయూల థర్మల్‌ విద్యుత్‌ వస్తోంది. సౌరవిద్యుత్‌ 14.3 ఎంయూలు, పవన విద్యుత్‌ 8.16 ఎంయూల వరకు అందింది. వీటితోపాటు ఎన్‌టీపీసీ నుంచి వచ్చే విద్యుత్‌పోను డిమాండ్‌ సర్దుబాటుకు ప్రతి రోజూ 45-50 ఎంయూల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌నుంచి డిస్కంలు కొనుక్కోవాల్సి వస్తోంది. మన పొరుగు రాష్ట్రాలు కూడా బహిరంగ మార్కెట్‌పై ఆధారపడటంతో పోటీ పెరిగి యూనిట్‌ ధరను ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. సగటు యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు వ్యయం రూ.6.50కు చేరింది. గత నెల యూనిట్‌కు సగటున రూ.4.50 వంతున డిస్కంలు చెల్లించాయి. సాయంత్రం గరిష్ఠ వినియోగం సమయంలో యూనిట్‌ రూ.20కి కొంటున్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు రోజుకు రూ.30-35 కోట్లు వెచ్చిస్తున్నారు.

రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయిలు:ఒడిశాలోని మహానది కోల్‌మైన్స్‌ నుంచి తీసుకున్న బొగ్గుకు సంబంధించిన రూ.650 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. సింగరేణికి బిల్‌డిస్కౌంట్‌ చేసిన రూ.400 కోట్లను కూడా చెల్లించాల్సి ఉంది. ఇవి మొత్తంగా రూ.వెయ్యి కోట్లు దాటాయి. బకాయిలు చెల్లించిన సంస్థలకే సరఫరాలో బొగ్గు ఉత్పత్తి సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయి. బకాయిల కారణంగా ఆయా సంస్థలు బొగ్గు సరఫరా తగ్గిస్తే జెన్‌కో థర్మల్‌ప్లాంట్లను నిలిపేయాల్సి వస్తుంది. ప్రస్తుతం జెన్‌కో థర్మల్‌ప్లాంట్ల నుంచి రోజూ 80-85 ఎంయూల విద్యుదుత్పత్తి అవుతోంది. ప్రత్యామ్నాయంగా బహిరంగ మార్కెట్‌నుంచి విద్యుత్‌ కొనుగోలు చేద్దామన్నా దొరకడం లేదు. దీంతో బొగ్గు సరఫరా పెంచుకోవటానికి, ఏపీ జెన్‌కో బకాయిల సర్దుబాటుకు నిధులు కావాలని ప్రభుత్వానికి జెన్‌కో లేఖ రాసింది.

ABOUT THE AUTHOR

...view details