ESMA Act:ఏపీలోగనులశాఖలో జారీ చేసిన ఎస్మా ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అవసరమైతే ప్రభుత్వమే ఎస్మా ఉత్తర్వులు జారీ చేస్తుందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
ఉద్యోగుల విస్మయం..
ఓ వైపు ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కొనసాగుతుండగానే.. గనులశాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఇవాళ సాయంత్రం ఎస్మా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చల వేళ ఎస్మా ఉత్తర్వులపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు. గనులశాఖలో అత్యవసర సేవలు ఏముంటాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎస్మా నిర్ణయంపై వెనక్కి తగ్గిన గనుల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులను ఉపసరించుకున్నారు.
ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ..
ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులు, ఐఆర్ రికవరీతో పాటు నిన్న అర్ధరాత్రి ప్రతిపాదించిన అంశాలపై చర్చ కొనసాగుతోంది. సమావేశం ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రుల కమిటీ వెళ్లనున్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో భేటీకి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రుల కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌కు కమిటీ నివేదించింది.
చిన్న చిన్న విషయాలే: బొత్స
"నిన్న అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం. ఈ మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో సమావేశమవుతాం. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల గురించి ఈ రోజు చర్చిస్తాం. ఐఆర్ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చాం. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్లు భారం ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలే. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తాం’"అని బొత్స అన్నారు.
ఫిట్మెంట్ 23 శాతంలో మార్పుండదు..ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై చర్చించాలన్న ఆయన.. ఫిట్మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు అడిగారన్న సజ్జల...హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో సవరణలతో రూ. 7వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. హెచ్ఆర్ఏలో పాత శ్లాబులే కొనసాగించాలని, కనీస హెచ్‌ఆర్‌ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగినట్లు సజ్జల వెల్లడించారు.
ఇదీ చదవండి: