తెలంగాణ

telangana

ETV Bharat / city

58 శాతం పనులయ్యాయ్‌: పోలవరంపై సుప్రీంకోర్టుకు స్టేటస్‌ రిపోర్ట్‌ - పోలవరం తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టులో 58 శాతం పనులు పూర్తయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హెడ్‌వర్క్స్‌ పనులు 58.5 శాతం జరగ్గా... కుడి ప్రధాన కాలువ 91. 69, ఎడమ ప్రధాన కాలువ 69.96 శాతం పూర్తయ్యాయంటూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఒడిశా లేవనెత్తుతున్న అభ్యంతరాలు అసంబద్ధమని స్పష్టం చేసింది.

ap-govt-submitted-polavarm-status-report-in-supreme-court
పోలవరం 58 శాతం పనులయ్యాయ్​.. సుప్రీంకు స్టేటస్ రిపోర్ట్

By

Published : Feb 5, 2020, 11:10 AM IST

పోలవరం 58 శాతం పనులయ్యాయ్​.. సుప్రీంకు స్టేటస్ రిపోర్ట్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ పూర్తైన పనుల వివరాలను ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కేసుపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఇప్పటివరకూ జరిగిన పనులపై స్థాయీ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.
సుప్రీం ఆదేశాలతో.. 60 పేజీలకు పైగా అఫిడవిట్‌ను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వరద ప్రవాహం 36 లక్షల క్యూసెక్కులు కాగా, గరిష్ఠ వరద ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులని... కేంద్ర జలసంఘం ఇప్పటికే ఈమేరకు అనుమతించిందని పేర్కొంది.

ఒడిశా వాదన అసంబద్ధం

ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ముంపు తలెత్తకుండా అక్కడి ఉప నదులపై కరకట్టలు నిర్మించేందుకు సాంకేతిక సలహా మండలి అంగీకరించిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది.

ఆ దిశలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆ 2 రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లను నిరంతరం కోరుతూ వస్తుండగా... పదేళ్లైనా ఆ పని పూర్తి చేయలేదని పేర్కొంది.

ముంపు తలెత్తకుండా నిర్మించే రక్షణ గోడల వల్ల ఒడిశాలో నివసిస్తున్న ప్రజలపై ఎలాంటి ప్రభావం పడదని తెలిపింది. తమ భూభాగంలో భారీ ఎత్తున అటవీ, పంటభూములు, గ్రామాలు ముంపునకు గురవుతాయని మల్కన్​గిరి జిల్లాలో ఆదివాసీ గిరిజన తెగలు కనుమరుగవుతాయన్న ఒడిశా వాదన పూర్తిగా అసంబద్ధమని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 5 వేల 133 కోట్లు

భూ సేకరణ, సహాయ-పునరావాసానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం సమగ్రంగా వివరించింది. ఆయా వివరాల ప్రకారం 371 నివాస ప్రాంతాల్లోని లక్షా 5వేల 601 కుటుంబాలు ప్రభావితం అవుతుండగా 3వేల 922 కుటుంబాలకు పునరావాస కల్పన పూర్తైంది.

లక్షా 66 వేల 423 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా... ఇప్పటివరకూ లక్షా 10 వేల 823 ఎకరాల సేకరణ పూర్తైంది. భూ సేకరణ, సహాయ, పునరావాసం కోసం 6వేల 371 కోట్లు ఖర్చైంది. ఇందుకోసం ఇంకా 26 వేల 796 కోట్లు కావాలి.

2020 జనవరి 10 వరకూ ప్రాజెక్టు కోసం చేసిన మొత్తం ఖర్చు 16 వేల 996 కోట్లని వెల్లడించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు 5వేల 135కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత 11వేల 860 కోట్లు ఖర్చు జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్రానికి తిరిగి చెల్లించిన మొత్తం 6వేల 727 కోట్లు. కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన మొత్తం 5వేల 133 కోట్లు.





ఇదీ చదవండి :కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి పచ్చజెండా ఊపిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details