ఏపీలోని కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి వద్ద.. యురేనియం కర్మాగారం రెండో గని విస్తరణ పనులు జోరందుకున్నాయి. 2006లో ప్లాంటు ఏర్పాటుకు అధికారులు యత్నించగా... గ్రామస్థుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజాభిప్రాయసేకరణలో రాళ్లదాడి, గొడవలూ జరిగాయి. అప్పటి నాయకులు నచ్చజెప్పగా... తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, రాచకుంటపల్లి, భూమయ్యగారిపల్లె గ్రామాల రైతులు పట్టా భూములు ఇచ్చారు.
రూ.1,106 కోట్ల వ్యయంతో
1820 ఎకరాల్లో... రూ.1,106 కోట్ల వ్యయంతో 2007లో ప్లాంటు నిర్మాణం మొదలైంది. 2013 ఏప్రిల్ 20న యురేనియం ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. యురేనియం వ్యర్థాలు నిల్వ చేయటంతో... భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని... వింత వ్యాధులతో సతమతమవుతున్నామని ప్రజలు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు ఉద్యమాలు చేశారు. ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు, ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... రెండో గని విస్తరణకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో.. గ్రామస్థులు ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.