ఏపీలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. మరో 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ మేరకు మొదట మినీ డీఎస్సీ, ఆ తర్వాత సాధారణ డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ముందుగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఇందులో మిగిలిన వాటిని జనరల్‌కు మారుస్తారు. నియామక పరీక్షతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్షనూ (టెట్) నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే... తేదీలను నిర్ణయించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈసారి పాఠ్య ప్రణాళికనూ మారుస్తున్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అభ్యర్థుల్లోని ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు.
ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. హేతుబద్దీకరణ, బదిలీల అనంతరం అధికారులు ఖాళీల వివరాలను సేకరించారు. భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. 16వేలకుపైగా ఖాళీల్లో ఎన్నింటికి ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతుందో స్పష్టత రాలేదు. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలోనూ పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బ్యాక్‌లాగ్ డీఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి అన్నీ సవ్యంగా జరిగితే నియామకాల పూర్తికి రెండున్నర నెలల సమయం పడుతుంది. నియామకాల ప్రకటనకు పరీక్షకు మధ్య 45 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష, ఫలితాలు, కౌన్సెలింగ్‌కు మరో నెల వరకు సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే సాధారణ డీఎస్సీకి ప్రకటన ఉండొచ్చు.