తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం కౌంటర్ - రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్​పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు న్యూస్

ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బోగస్‌ కేసు మోపిందని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో చేసిన వాదనలను ఆ ప్రభుత్వం ఖండించింది. రఘురామకృష్ణరాజు ప్రకటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది.

supreme court, supreme court on mp rrr case
సుప్రీం కోర్టు, ఏపీ ఎంపీ కేసుపై సుప్రీం

By

Published : May 20, 2021, 9:22 AM IST

ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బోగస్‌ కేసు మోపిందని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో చేసిన వాదనలను ఆ ప్రభుత్వం ఖండించింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీఐడీ అధికారులే సొంతంగా దర్యాప్తు చేయించినట్లు చెప్పి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్న వాదనలనూ తోసిపుచ్చింది. రఘురామకృష్ణరాజు ప్రకటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది. ఎవరో వచ్చి ఫిర్యాదు చేసే వరకూ ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఎదురుచూడాలని చెప్పే హక్కు పిటిషనర్‌కు లేదంది. రాష్ట్ర ప్రభుత్వం తనపై మోసిన రాజద్రోహం కేసులో బెయిల్‌ కోసం రఘురామకృష్ణరాజు వేసిన ఎస్‌ఎల్‌పీకి కౌంటర్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎదుటివర్గంపై దాడి చేయడమే కాకుండా చంపేంతవరకు వెళ్లేలా వ్యక్తులను రెచ్చగొట్టేందుకు ఆయన ప్రయత్నించారని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వ వాదన ఇదీ..

'రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని పెంచడానికి రఘురామకృష్ణరాజు నిరంతరం ఉద్దేశపూర్వక ప్రయత్నం చేశారు. ఆయన ప్రకటనలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే రాజద్రోహ నేరం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. పార్లమెంటు సభ్యుడితోపాటు ప్రతి వ్యక్తికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్వతంత్ర హక్కు ఉంటుంది. అయితే ఆ హక్కును శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉపయోగించడానికి వీల్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛలోనే శాంతిభద్రతలకు భంగం కలిగించరాదన్న విషయం అంతర్గతంగా ఉంటుంది. ఆయన ఒకటి, రెండుసార్లు పొరపాటునో, గ్రహపాటునో ప్రకటనలు చేయలేదు. పలువురు వ్యక్తులతో కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాష్ట్రంలో కులాలు, మతాల ఆధారంగా చిచ్చుపెట్టి అశాంతి సృష్టించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వంపట్ల అసంతృప్తిని రాజేయడానికే వివిధ తరగతులు, సామాజికవర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు, ప్రకటనలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే చర్యకు పూనుకున్నాం. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగానూ ఆయన పత్రికా సమావేశాలు నిర్వహించకుండా వెనక్కు తగ్గలేదు. తన పాదాలపై పోలీసులు కొట్టినట్లు చూపించి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి సంజ్ఞ చేశారు. కస్టడీలో ఎంపీని చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నిరాధారం. అదే నిజమై ఉంటే ప్రభుత్వం పిటిషనర్‌ను వైద్యపరీక్షకు పంపడానికి అనుమతి ఇచ్చి ఉండేదే కాదు. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఒక భ్రాంతిని సృష్టించడానికే ఆయన అలా చేశారు’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.

విచారించాలి.. పోలీసు కస్టడీకి ఇవ్వండి
'తనపై రాజకీయ/ఇతరత్రా కారణాలతోనే చర్యలు తీసుకుంటన్నారన్న పిటిషనర్‌ ఆరోపణల్లోనూ నిజం లేదు. పోలీసు శాఖ పూర్తి నిష్పాక్షికంగా పనిచేస్తోంది. ఎంపీ ప్రకటనలు క్షేత్రస్థాయిలో విధ్వంసకర ప్రభావం చూపుతున్నాయని గుర్తించిన తర్వాతే పోలీసు శాఖ ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉంది. ఆయన ఇకముందు ఏమైనా ప్రకటనలు కొనసాగిస్తే రాష్ట్రంలో తీవ్ర శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎంపీ ప్రవర్తనతోపాటు, సహకుట్రదారుల పాత్రనూ విచారించాల్సి ఉంది. అందువల్ల రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీకి ఇవ్వాలి. ఈ నెల 17న ఈ కోర్టు ఆయన్ను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి తరలించి, వైద్యపరీక్షలు చేయించాలని ఆదేశించిన తర్వాత అంబులెన్సులో వెళ్లనని, తన సొంత వాహనంలోనే తీసుకెళ్లాలని పట్టుబట్టారు. కోర్టు నిర్దేశించిన గడువును దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఆ డిమాండ్‌ను అంగీకరించక తప్పలేదు. అయితే ఆయన వాహనంలో బయలుదేరిన తర్వాత వాహనం నుంచే తన పాదాలను మీడియాకు చూపుతూ మొత్తం ప్రక్రియనంతా హాస్యాస్పదంగా మార్చారు. ఆ దృశ్యాలు మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. ఆ వీడియోలను యూట్యూబ్‌లో చూడొచ్చు’ అని ప్రభుత్వం అఫిడవిట్‌లో వివరించింది.

ఎంపీకి వైద్యపరీక్షలు

హైదరాబాద్‌ తిరుమలగిరిలోని సైనికాసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బుధవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన వైద్యబృందం ఆయనకు రక్తపోటు, మధుమేహం పరీక్షలతో పాటు రక్తపరీక్షలనూ నిర్వహించింది. ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఎంపీని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు నుంచి సోమవారం రాత్రి తిరుమలగిరిలోని సైనికాసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో మంగళవారం ఆయనకు పరీక్షలు నిర్వహించి సీల్డ్‌ కవర్‌లో నివేదికను సుప్రీంకోర్టుకు పంపించారు. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎంపీ సైనికాసుపత్రిలోనే చికిత్స పొందనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details