తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏడాది అప్పు ఐదు నెలల్లోనే! - ఏపీ ఏడాది అప్పులు ఐదు నెలల్లోనే వార్తలు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులతోనే నెట్టుకొస్తోంది. సంవత్సర కాలానికి నిర్దేశించుకున్న అప్పును కేవలం 5 నెలల్లోనే తీసేసుకుంది. 47 వేల కోట్లకు పైగా రుణంగా పొందినట్లు కాగ్‌ లెక్కగట్టింది. ఇక ఇప్పటికే 38 వేల 199 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడినట్లు నిర్ధరించింది.

ap-govt-has-taken-debt-which-is-mend-for-one-year-latest-cag-report-says
ఏడాది అప్పు ఐదు నెలల్లోనే!

By

Published : Sep 30, 2020, 9:10 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక బండి అప్పులతోనే సాగుతోంది. ఇంకా సగం ఆర్థిక సంవత్సరం కూడా పూర్తికాక ముందే ఏడాది కాలానికి అంచనా వేసుకున్న అప్పు మొత్తం తీసేసుకుంది. 5 నెలల్లో వివిధ రూపాల్లో 84 వేల 617.23 కోట్ల రూపాయలు సమీకరించగా అందులో 47 వేల 130.90 కోట్లు అప్పుగా తీసుకున్న సొమ్మే. అంటే దాదాపు 55.7% రుణం కిందే లెక్క. అదే సమయంలో రెవెన్యూ లోటు బాగా పెరిగింది. ఏడాది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇప్పటికే రెట్టింపు దాటింది. ఒకవైపు కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, పన్నులు, పన్నేతర ఆదాయాలు తగ్గిపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. మూలధన వ్యయం కన్నా ఖర్చులో సంక్షేమం వాటా ఎక్కువగా ఉంటోంది. ఏడాది మొత్తమ్మీద సెక్యూరిటీల వేలం, ఇతరత్రా అప్పుల రూపంలో 48 వేల 295.58 కోట్లు తీసుకుంటామని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొనగా.. ఆగస్టు నెలాఖరు నాటికే 47 వేల 130.90 కోట్ల రుణాలు తీసుకొచ్చింది. కాగ్‌ విడుదల చేసిన ఖర్చుల వివరాల ప్రకారం ఇప్పటికే 97.59% మేర అప్పులను ప్రభుత్వం సమీకరించింది.

రెవెన్యూ లోటు రూ.38 వేల 199.33 కోట్లు

రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ ఖర్చు పెరిగిపోవడం వల్ల లోటు అంచనాలను మించిపోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి 5 నెలలకు 38 వేల 199.33 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. బడ్జెట్‌ అంచనాల్లో ఏడాది కాలానికి ప్రభుత్వం 18 వేల 434.15 కోట్లు రెవెన్యూ లోటును అంచనా వేసింది. అయితే తొలి 5 నెలల్లోనే లోటు అంచనాలకు రెట్టింపైంది. ఒకవైపు ఆదాయాలు తగ్గుతున్నప్పటికీ రెవెన్యూ వ్యయంలో నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఆగస్టు నెలాఖరుతో పూర్తయిన 5 నెలల కాలానికి 75 వేల 669.98 కోట్లు వ్యయం చేయాల్సి వచ్చింది. జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, రాయితీల రూపంలోనే పెద్దమొత్తంలో వ్యయం అవుతోంది. ఇక మొత్తం వ్యయం 84 వేల 521.60 కోట్లు అయింది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈసారి భారీగా దిగుబడులు... కొనుగోళ్లు ఎలా?

ABOUT THE AUTHOR

...view details