తెలంగాణ

telangana

ETV Bharat / city

Employees Agitation: ఏపీలో ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులు

Employees Agitation: డిమాండ్ల సాధన కోసం.. ఉద్యోగులు ఏపీవ్యాప్తంగా ఉద్యమ బాట పట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ బ్యాడ్జీలతోనే విధులకు హాజరయ్యారు. పీఆర్సీ సహా ప్రభుత్వం ముందు ఉంచిన 71 సమస్యల్ని పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Employees Agitation
Employees Agitation

By

Published : Dec 7, 2021, 10:28 PM IST

ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులు

AP Employees Agitation: సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనలకు దిగారు. కర్నూలులో ఉద్యోగ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఈ నిరనస కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుంటే.. సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల్ని అణచివేయాలని చూస్తే.. ఊరుకోబోమన్నారు. ఉద్యోగుల 71 డిమాండ్లలో ఒక్క పీఆర్సీపై మాత్రమే సీఎం జగన్‌.. స్పందించారని మిగిలిన వాటి పరిస్థితి ఏంటని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖలో ఉద్యోగ సంఘాల నిరసనలో పాల్గొన్న ఆయన.. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని నిలదీశారు.

పీఆర్సీ అమలును డిమాండ్ చేస్తూ విజయవాడలో ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జలవనరుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ప్రజా రవాణ శాఖ ఉద్యోగులంతా ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. రవాణాశాఖ కార్యాలయంలోకి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగులను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవటంతో కొద్దిసేపు ఉద్యోగ సంఘాలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్యోగులు, పింఛన్‌దారులపై ప్రభుత్వం మోసపూరిత విధానాలు దారుణమంటూ.. గుడివాడలో ఉద్యోగులు నిరసన తెలిపారు. న్యాయమైన తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ.. ఉద్యోగ సంఘాలు గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ..ఏలూరులో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు తాగునీటి పంపుల చెరువు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరు ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతపురంలోని డీఎంహెచ్​వో కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ..నినాదాలు చేశారు.

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్సీ అమలు చేసి, బకాయిపడ్డ ఏడు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్‌లోని వివిధ శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతోనే విధులు నిర్వహించారు. నెల్లూరు నీటిపారుదలశాఖ కార్యాలయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ.. విశాఖ జిల్లా పాడేరు డివిజన్‌ ఉద్యోగుల సంఘం ఆందోళన చేపట్టింది. సీపీఎస్‌ రద్దు చేసి.. డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:TRS MPs boycott Parliament: 'పార్లమెంట్‌ సమావేశాలు బాయ్‌కాట్ చేస్తున్నాం.. రాజీనామా అంశాన్ని ఆలోచిస్తాం'

ABOUT THE AUTHOR

...view details