తెలంగాణ

telangana

ETV Bharat / city

నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళతాం: సజ్జల - నారాయణ న్యూస్

Sajjala on Narayana bail: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్టు చేయించేవారన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో అరెస్టైన నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి

By

Published : May 11, 2022, 5:59 PM IST

Sajjala on Narayana bail: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకే పేపర్​ లీక్​కు పాల్పడినట్లు వెల్లడించారు.

నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు తెలిపారన్నారు. నారాయణ ప్రమేయం ఉండటం వల్లే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారన్నారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని... రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేయించేవారన్నారు.

నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారై విద్యా సంస్థల్లో నేర సంస్కృతిని సజ్జల మండిపడ్డారు. చీడ పురుగులా మారి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పరీక్షల వ్యవస్థలో చెద పురుగుల్లా పట్టి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్​లో చైతన్య విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని.. వారినీ వదిలే ప్రసక్తి లేదన్నారు.

పేపర్​ లీకేజీ ఘటనతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్ వెనుక ఎవరున్నా.. ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభం కానప్పటికీ అక్రమాలు జరిగాయని సజ్జల అన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయన్నారు.

సినీఫక్కీలో అరెస్టు: మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు నాటకీయ ఫక్కీలో నిన్న అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు వాహనాల్లోకి మారుస్తూ తెలంగాణ సరిహద్దులు దాటించి చిత్తూరుకు తరలించారు. ఏపీ పోలీసులు మంగళవారం 3 బృందాలుగా హైదరాబాద్‌ చేరుకున్నారు.

తెల్లవారుజాము నుంచే నార్సింగి, కేపీహెచ్‌బీ కాలనీ, కొండాపూర్‌ ప్రాంతాల్లోని నారాయణ నివాసాల వద్ద మాటు వేశారు. ఉదయం 10.30-11 గంటల సమయంలో కొండాపూర్‌ నివాసం నుంచి నారాయణ దంపతులు కారులో బయటకు వచ్చారు. మాదాపూర్‌ ఐకియా కూడలి వద్దకు రాగానే మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

ఆయన భార్యను కిందకు దింపి, అదే కారులో వేగంగా వెళ్లిపోయారు. తనను కిడ్నాప్‌ చేస్తున్నారంటూ కారులో నుంచే నారాయణ కేకలు వేసినట్టు తెలిసింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన ఆయన భార్య, అనుచరులు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన వారు ఆ కారును అనుసరించారు. మధ్యాహ్నం 12.30కు కర్నూలు జాతీయ రహదారి కొత్తూరు జేపీ దర్గా వద్దకు చేరిన కారును కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు బృందం నిలిపింది.

వాహనంలో ఉన్న ఏపీ పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టు చేసేందుకు నారాయణను తీసుకువెళుతున్నట్లు ఆధారాలు చూపారు. దీంతో తెలంగాణ పోలీసులు ఆయనను తీసుకువెళ్లడానికి అంగీకరించారు. అక్కడే ఏపీ పోలీసులు నారాయణను మరో వాహనంలో ఎక్కించుకొని వెళ్లిపోయారు.

తొలుత నారాయణ కిడ్నాప్‌ అయినట్లు భావించి ఆందోళనకుగురై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భార్య రమాదేవి సిద్ధమయ్యారని మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి ‘ఈనాడు’కు తెలిపారు. అరెస్టు చేసినట్లు తెలుసుకుని ఫిర్యాదు చేయకుండా ఆగిపోయినట్లు చెప్పారు. నారాయణను ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తున్నారని తనకు మాదాపూర్‌ పోలీసులు కారు నంబరు పంపినట్లు కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజ్‌ తెలిపారు. ఆ సమాచారంతోనే కారు ఆపామన్నారు.

కుమారుడి వర్ధంతి అన్నా వినలేదు:మాజీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌ నారాయణ 2017 మే 10న ప్రమాదంలో మరణించారు. మంగళవారం తనయుడి వర్ధంతి కోసం నారాయణ దంపతులు బయల్దేరినట్టు సమాచారం. క్రతువు పూర్తి చేయకుండానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధంతి కార్యక్రమం పూర్తి చేశాక అదుపులోకి తీసుకోవాలని నారాయణ కోరినా పోలీసులు అందుకు అంగీకరించలేదని సమాచారం.

సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఆయన ఉన్న ప్రదేశాన్ని గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న నారాయణ తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేశారని తెలంగాణ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరో నంబరు వాడుతున్నట్లు సమాచారం. ఈ నంబరునూ ఏపీ పోలీసులు తెలుసుకుని లొకేషన్‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.

కళ్లు గప్పి.. దారి మళ్లించి..:మాజీ మంత్రి నారాయణను చిత్తూరు తరలించే విషయంలో పోలీసులు అందరి కళ్లుగప్పి దారి మళ్లించారు. తెలంగాణలోని గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా మీదుగా నారాయణను తీసుకెళ్తారని అందరూ అక్కడే గంటలపాటు నిరీక్షించారు. కర్నూలు పోలీసులు తెలంగాణలోని అలంపూర్‌ చౌరస్తా నుంచి రాజోలి మీదుగా గూడూరు తీసుకెళ్లారు.

అక్కడి నుంచి కర్నూలు మీదుగా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం వరకు వెళ్లి అక్కడ సిద్ధంగా ఉన్న చిత్తూరు పోలీసులకు అప్పగించారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి నారాయణను..పోలీసులు చిత్తూరులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. గతరాత్రి పొద్దుపోయాక చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి నివాసంలో నారాయణను హాజరుపరిచారు.

బెయిల్ మంజూరు: ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరఫున న్యాయవాది తెలిపారు. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:Hyderabad CP CV Anand: హ్యాకర్స్​ కా బాప్ హైదరాబాద్​ పోలీస్.. 'ఎలాంటి కేసైనా ఛేదిస్తాం'

వేల అడుగులు ఎత్తయిన కొండపై ట్రాక్టర్​ స్టంట్స్​.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details