కరోనా భయంకరమైన వైరస్... దానికి నివారణే తప్ప మరో మార్గం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మహమ్మారిని తక్కువ అంచనా వేయొద్దని, కప్పి పుచ్చే ప్రయత్నం చేయవద్దని మొదటి నుంచి ఏపీ ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు.
‘‘మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిన్న కేసులు పెరిగాయి. మేం చెప్పేదాన్ని మీరు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో చెలగాటం వద్దు. ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రెడ్ జోన్‌లు ఉన్నాయి. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప కరోనాను నివారించలేం. వైద్యులు, సిబ్బందికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వైద్యులకు మాస్క్‌లు, పీపీఈలు ఇస్తున్నారా? కరోనాపై క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే వారిని మనం రక్షించుకోవాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అనేక సార్లు కోరాం... అయినా పట్టించుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఎవరైనా స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడతారా? ఇలాంటి సమయంలో ఆర్డినెన్స్ ఇచ్చి ఎస్‌ఈసీని తీసేస్తారా? ’’