గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష, విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం జీవోపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా.. కౌంటర్ దాఖలు చేశారు. ప్రతివాదుల కౌంటర్‌కు రిజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. పిటిషన్ విచారణను కోర్టు మూడు వారాలు వాయిదా వేసింది.
అమరావతి భూసమీకరణలో అక్రమాలు..
అమరావతి భూసమీకరణలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదనపు సమాచారం దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. అమరావతి భూ సమీకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేయడంపై మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు ప్రభుత్వ విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ..
మాజీ ఏజీ దమ్మాలపాటిపై.. సీఐడీ విచారణ మీద హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరడంతో విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: Indrajaal: డ్రోన్ల పనిపట్టే హైదరాబాద్ 'ఇంద్రజాల్'