ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఒక మహానగరంగా నిర్మించాలని తలపెట్టినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లకుపైగానే వెచ్చించింది. అమరావతిని కేవలం ఒక పరిపాలనా నగరంగా కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు, సంపద సృష్టికి కేంద్రంగా, ఉపాధి అవకాశాలకు నిలయంగా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. 2050 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేసింది. కీలకమైన ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన ప్రక్రియలు ఇప్పటికే పూర్తయి, పనులు కూడా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు రాజధానిని మరో చోటుకి మార్చడం వల్ల... ఇంతవరకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మౌలిక వసతుల కల్పనకు
ఈ వ్యయంలో... ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, భవన నిర్మాణాలు, పనులకు ఇంకా చెల్లించాల్సిన బిల్లులు, భూములిచ్చిన రైతులకు చెల్లించిన కౌలు, భూమిలేని పేదలకు ప్రతి నెలా ఇస్తున్న పింఛన్లు, రాజధాని రైతులకు రుణ ఉపశమనం, నిమ్మ, మల్లె తోటలు వంటి వాణిజ్య పంటలకు ఇచ్చిన పరిహారం, వైకాపా అధికారంలోకి రాగానే కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు వంటివన్నీ ఉన్నాయి. మంత్రులు, అధికారులు రాజధాని పనుల నిమిత్తం వివిధ దేశాల్లో చేసిన పర్యటనలు, నిర్వహించిన సదస్సులు, సమావేశాలు, అధ్యయనాల కోసం చేసిన ఖర్చు కలిపితే ఇది మరింత పెరుగుతుంది.
ఖర్చు చేసింది ఇలా..!
- వివిధ దశల్లో మొత్తంగా రూ.1,09,023 కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. దశల వారీగా చేయాల్సిన ఖర్చు ఇది. ప్రధాన మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు ఫ్లాట్లు ఇచ్చిన లేఅవుట్‌లలో వసతుల అభివృద్ధికి తొలిదశలో రూ.52,837 కోట్లు ఖర్చవుతుంది.
- సీఆర్‌డీఏ లెక్కల ప్రకారం... ఇంతవరకు రూ.42,170కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో ఇప్పటికే పూర్తయిన, ప్రారంభమైన పనులు రూ.41,677 కోట్లు. చెల్లించిన బిల్లులు రూ.5,674 కోట్లు ఉండగా... ఇంకా చెల్లించాల్సిన బకాయిలు రూ.1,800 కోట్ల వరకు ఉంది.
- కొండవీటివాగు ఎత్తిపోతల పథకానికి రూ.250 కోట్లు, టిడ్కో ద్వారా పేదలకు గృహ నిర్మాణానికి రూ.305 కోట్లు ఖర్చు చేసింది. అంటే రాజధానిలో భౌతికంగా జరిగిన పనుల విలువ రూ.8 వేల కోట్లకుపైగానే ఉంది.