AP Government contract with SECI : ఎస్ఈసీఐతో ఏపీ సర్కార్ ఒప్పందం.. యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొనేందుకు నిర్ణయం - AP buys Electricity from SECI 2021
AP Government contract with SECI : భారత సౌర విద్యుత్ సంస్థతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం ప్రభుత్వానికి భారంగా మారబోతోంది. గుజరాత్ ప్రభుత్వం యూనిట్ దాదాపు రెండు రూపాయలకే కొనేందుకు అల్‌జొమాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే.. సెకీ నుంచి 2 రూపాయల 49 పైసలకు కొనేందుకు ఏపీ సర్కార్ సిద్ధపడడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రంపై ఏటా 850 కోట్ల భారం పడనుంది.
ఎస్ఈసీఐతో ఏపీ సర్కార్ ఒప్పందం
By
Published : Nov 26, 2021, 10:50 AM IST
ఎస్ఈసీఐతో ఏపీ సర్కార్ ఒప్పందం
AP Government contract with SECI : టెండర్లు లేవు..రివర్స్ టెండరింగ్ ఊసే లేదు..వేరే ఏపీలోలో సౌర విద్యుత్ ప్లాంట్లఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న వివిధ సంస్థలు..యూనిట్ కరెంటు 2 రూపాయల 49పైసలకు ఇచ్చేందుకు ముందుకొచ్చాయ్.. పాతికేళ్లకు మాతో ఒప్పందం చేసుకోండంటూ ఈ ఏడాది సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వానికి భారత సౌర విద్యుత్ సంస్థ లేఖ రాసింది. 2024 సెప్టెంబరు నుంచి విద్యుత్ సరఫరా మొదలవుతుందని రాసుకొచ్చింది. మరో ఆలోచన లేకుండా మర్నాడే ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Solar power news : సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీ వ్యయం దిగివస్తుండటంతో సౌర విద్యుత్ ధరలూ వేగంగా తగ్గుతున్నాయి. 2 రూపాయలకే యూనిట్ విద్యుత్ విక్రయించేందుకు ఉత్పత్తి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వ సంస్థైన గుజరాత్ ఊర్జ వికాస్ నిగమ్ లిమిటెడ్ యూనిట్ కరెంటు రూపాయ 99 పైసలకు కొనేందుకు అల్‌జొమాయ్ ఎనర్జీ, వాటర్ కంపెనీతో ఈ ఏడాది జనవరి 30న ఒప్పందం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా, సంస్థైనా మార్కెట్‌లో ఎంత తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుందో అధ్యయనం చేస్తుంది. ఎక్కడో రాజస్థాన్‌లో ప్లాంట్లు పెట్టి, మన రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడంలోని సాధకబాధకాల్ని ఆలోచిస్తుంది. తమ దగ్గరే ప్లాంట్లు పెట్టి తక్కువ ధరకు విద్యుత్ ఇమ్మని కోరుతుంది. ఏపీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా సెకీ చెప్పగానే రాజస్థాన్‌లోని ప్లాంట్ల నుంచి ఏడు వేల మెగావాట్ల కరెంటు కొనేందుకు ఒప్పందం చేసుకోబోతోంది. ఏడాదికి 17 వందల కోట్ల యూనిట్ల విద్యుత్ కొనేందుకు ఏపీఈఆర్సీ(APERC) కూడా పచ్చజెండా ఊపింది.
ఆ ఒప్పందం అంతరార్థం ఏమిటి?
AP Green Energy Corporation : ఏపీలో 6 వేల 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ 2020 జూన్‌లో టెండర్లు పిలిచింది. ఎన్‌టీపీసీ, అదానీ వంటి పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. యూనిట్‌కు కనిష్ఠంగా 2 రూపాయల 48 పైసల నుంచి గరిష్ఠంగా 2 రూపాయల 58 పైసలు కోట్ చేశాయి. కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా నిబంధనలు పెట్టారంటూ కొందరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో రివర్స్ టెండరింగ్‌కూ వెళ్లలేదు. టెండర్ల ప్రక్రియలో లోపాలుంటే రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలి. కేవలం సెకీ ప్రతిపాదన ఆధారంగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు పాతికేళ్లపాటు ఒప్పందం చేసుకోవడమంటే నామినేషన్ పద్ధతిపై ఇచ్చినట్టేనని నిపుణులు అంటున్నారు. 100 కోట్లు దాటిన ప్రతి పనికీ రివర్స్ టెండరింగ్‌కి వెళతామన్న ప్రభుత్వం....అసలు టెండరే లేకుండా సెకీతో ఏకంగా లక్షా 5 వేల 825 కోట్ల విలువైన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవడంలో అంతరార్థం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రూ.2.49పైసలకు కొనడమేంటి ?
AP buys Electricity from SECI : ఏపీకి యూనిట్ 2 రూపాయల 49 పైసలకు అమ్ముతామంటున్న సెకీ.. ఇటీవల వివిధ విద్యుదుత్పత్తి సంస్థలతో యూనిట్ 2కే కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. సెకీ ట్రేడింగ్ మార్జిన్ యూనిట్‌కు 5-7 పైసలు కలిపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ 2 రూపాయల 5పైసలకో...2రూపాయల 7పైసలకో కొనాలే తప్పా 2 రూపాయల 49పైసలకు కొనడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సెకీ 2019 నవంబరులో పిలిచిన టెండర్ల ప్రకారం... 2024, 2025, 2026ల్లో విద్యుదుత్పత్తి చేసే సంస్థలతో మూడు నుంచి అయిదేళ్ల ముందే యూనిట్ 2 రూపాయల 49పైసలకు కొనేందుకు ఒప్పందాలు చేసుకోవడమేంటని నిలదీస్తున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో యూనిట్ సౌరవిద్యుత్ ధర ఒక రూపాయీ 50పైసలకు తగ్గొచ్చన్న అంచనాలను రాష్ట్రం ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే మధ్యవర్తి సంస్థ సెకీకి.. విద్యుత్ ఒప్పందాలు కుదర్చడం వల్ల 5 నుంచి 7 పైసల వరకు ట్రేడ్ మార్జిన్ దక్కుతుంది. మిగతా మొత్తం విద్యుదుత్పత్తి సంస్థలకే వెళ్తుంది. అంటే ఒప్పందంతో ఏపీ అదనంగా చెల్లించే వేల కోట్లు విద్యుత్ ఉత్పత్తిదారులకే వెళ్తాయి.
Solar Energy Corporation of India : సెకీ 2020 జనవరి నుంచి అదే ఏడాది జులై 16 వరకూ చాలా టెండర్లు పిలిచింది. రీఆక్షన్ తేదీల్ని చూసినా మొదటి, చివరి టెండర్ల మధ్య వ్యవధి 11 నెలలే. అంత తక్కువ సమయంలోనే సెకి ఖరారు చేసిన యూనిట్ ధర 2 రూపాయల 51 పైసల నుంచి 2 రూపాయలకు తగ్గింది. అలాంటప్పుడు సెకి రెండేళ్ల కిందట పిలిచిన టెండర్ల ఆధారంగా...యూనిట్ 2 రూపాయల 49 పైస లకు ఇస్తామంటే మరో ఆలోచన లేకుండా కొనేయడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అల్‌జొమాయ్ సంస్థతో గుజరాత్ ఊర్జ వికాస్ నిగమ్ లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలిస్తే..సెకీతో ఏపీ కుదుర్చుకోబోతున్న ఒప్పందం ఎంత లోపభూయిష్ఠమో అర్థమవుతోంది. సెకీతో ఒప్పందం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. దీనికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సెకీ, ఎన్‌టీపీపీ రెండూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే. ట్రేడ్ మార్జిన్ కలిపి యూనిట్ 2 రూపాయల 49 ఇస్తామని సెకీ చెప్పిందని సమాధానమిచ్చారు.