పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు తీర్పునకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం తరఫు నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్‌ఈసీకి సహకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఎస్‌ఈసీ నిర్ణయం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం సలహా తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి నిర్వహణ కష్టమేనన్న ఆయన... ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదల వెనుక కుయుక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు వైకాపా ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ద్వారా కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఇగో సమస్యలు లేవని... తమ ఆరాటం.. ప్రజల ఆరోగ్యం కోసమేనని చెప్పారు.