మహిళల భద్రత, రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న దిశ యాప్ వినియోగంపై అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. మహిళలు, యువతులు, విద్యార్ధినులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారం చేసి వారిలో అవగాహన పెంచాలని సీఎం జగన్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి, డీజీపీ సహా అత్యున్నత స్థాయి అధికారుల సమావేశంలో కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి.. తానే స్వయంగా యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని గొల్లపూడిలో జరిగే ఈ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
దిశ యాప్.. ఉద్దేశం
మహిళలకు మెరుగైన భద్రత, రక్షణ, అత్యవసర సమయాల్లో అండగా నిలిచే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దిశ బిల్లును ఆమోదించింది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణను శరవేగంగా దర్యాప్తుచేసి, బలమైన ఆధారాలతో న్యాయస్థానాల ముందు వారిని నిలబెట్టడానికి తగిన చర్యలు తీసుకుంది. వీటితో పాటుగా మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, ఇతరత్రా నేరాల నివారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రక్షణ, భద్రత కల్పించేలా మహిళలు, యువతుల్లో అవగాహన కల్పించేందుకు సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి మహిళా, యువతి, విద్యార్థిని కూడా తమ ఫోన్లలో దిశయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టింది. పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు విస్తృతంగా యాప్ డౌన్‌లోడ్, వినియోగంపై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.
16 లక్షల డౌన్‌లోడ్లు..
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించిన దిశయాప్‌ను ఇప్పటికే 16 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతి మహిళా, యువతి, విద్యార్థిని డౌన్‌లోడ్ చేసుకునేలా ఇంటింటికీ ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
పుష్ బటన్‌తో అలర్ట్..
ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో పుష్ బటన్ ఆప్షన్ ఉంటుంది. పోలీసులు అందరితో పాటు యాప్ ఉపయోగించే వారందరినీ ఒకేసారి అప్రమత్తం చేసేలా ఈయాప్‌లో అవకాశం ఉంది.