తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్యం ఖర్చులు భరించలేక.. కరోనా బాధితుని బలవన్మరణం

కరోనా భయం పలువురిని కాటేస్తోంది. కరోనా నుంచి బయటపడాలంటే ఆర్థిక భారం తట్టుకోలేమని మరో భయం కరోనా బాధితులను వెంటాడుతోంది. అదే భయంతో కాలువలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు సైతం అనాధ శవంగా వదిలేయగా... మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పొన్నూరు ఎం.ఎమ్.యూత్ ముందుకొచ్చి మృతిచెందిన వ్యక్తికి అంతిమ క్రతువు నిర్వహించారు.

man suicide due to not bearing corona expenditure
కరోనా వైద్యం ఖర్చులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

By

Published : May 13, 2021, 1:19 PM IST

కరోనా పలు కుటుంబాల్లో పెను విషాదం నింపుతోంది. మహమ్మారి నుంచి బయటపడాలంటే ఆర్థిక భారం తట్టుకోలేమనే భయంతో కొందరు బాధితులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పిట్టలవానిపాలెంలో అలాంటి సంఘటనే జరిగింది. గ్రామానికి చెందిన జాలాది చంద్రం(55) మనస్తాపంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రానికి, తన కుమారుడు రాజేశ్‌కు వారం క్రితం కొవిడ్‌ సోకింది. ఇద్దరూ చికిత్స నిమిత్తం పొన్నూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చేరారు. అయితే, వైద్యం ఖర్చులు ఎక్కువ కావటంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చంద్రం పొన్నూరు, పిట్టలవానిపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకునేందుకు ప్రయత్నించాడు.

ఫలితం లేకపోవటంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి గ్రామంలోని కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో మృతదేహం పైకి తేలింది. గ్రామస్థులు గుర్తించి బంధువులకు తెలియజేయగా ఎవరూ ముందుకు రాలేదు. సర్పంచ్​ అరుణకుమారి భర్త సుబ్బారావు చొరవ తీసుకొని పొన్నూరుకు చెందిన ఎం.ఎం. యూత్‌ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు పీపీఈ కిట్లు ధరించి చంద్రం మృతదేహాన్ని బయటకు తీసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. యూత్‌ సభ్యులు మాము, ఆరిఫ్‌, కరిముల్లా, బాషా, సుభాని, సూరజ్‌, మెమన్‌ బాషా, మౌలాలిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

ఇదీ చదవండి:రెండోరోజూ గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

ABOUT THE AUTHOR

...view details